'మహానుభావుడు' మూవీ రివ్యూ | Mahanubhavudu Movie Review | Sakshi
Sakshi News home page

'మహానుభావుడు' మూవీ రివ్యూ

Published Fri, Sep 29 2017 12:14 PM | Last Updated on Sat, Sep 30 2017 3:31 AM

Mahanubhavudu

టైటిల్         : మహానుభావుడు
జానర్         : రొమాంటిక్ ఎంటర్ టైనర్
తారాగణం  : శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్
సంగీతం     : తమన్
దర్శకత్వం : మారుతి
నిర్మాత      : వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్

పండుగ సీజన్ లో స్టార్ హీరోల సినిమాలకు పోటిగా బరిలో దిగి ఘనవిజయాలు సాధించిన రికార్డ్ శర్వానంద్ సొంతం. అదే ధైర్యంతో మరోసారి జై లవ కుశ, స్పైడర్ లాంటి సినిమాలు పోటి పడుతున్న దసరా సీజన్ లో మహానుభావుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు శర్వానంద్ ట్రాక్ రికార్డ్ ను కాపాడిందా..? మారుతి ఖాతాలో మరో సక్సెస్ ను అందించిందా..?

కథ :
ఆనంద్ (శర్వానంద్) ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే వ్యాధితో ఇబ్బంది పడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతి శుభ్రత, అతి నీట్‌ నెస్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి కారణంగా తాను ఇబ్బంది పడటంతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆనంద్ తల్లి, కజిన్ (వెన్నెల కిశోర్) లు కూడా  ఆనంద్ ప్రవర్తనతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆనంద్, మేఘన (మెహరీన్) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.

తన వ్యాధి గురించి చెప్పకుండా తనను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే మేఘన మాత్రం తన తండ్రి రామరాజు (నాజర్)కి నచ్చితేనే నిన్ను ప్రేమిస్తానని ఆనంద్ కు కండిషన్స్ పెడుతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన మేఘన తండ్రితో ఆనంద్ ఫ్రీగా ఉండలేకపోతాడు. రామరాజు కూడా తన కూతురికి ఆనంద్ కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ రామరాజు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు...? మేఘన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు..? ఆనంద్ వ్యాధిని అతడి ప్రేమ ఎలా జయించింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఓసీడీ అనే ఇబ్బందికర వ్యాధితో బాధపడే పాత్రలో శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహరీన్ రీ ఎంట్రీలో ఆకట్టుకుంది. గ్లామర్ షోతో పాటు నటిగానూ మంచి మార్కులు సాధించింది. వెన్నెలకిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సినిమా అంతా హీరో వెంటే ఉండే పాత్రలో నవ్వులు పూయించాడు. హీరోయిన్ తండ్రిగా నాజర్ హుందాగా కనిపించారు. కూతురి ప్రేమను గెలిపించేందుకు తపన పడే తండ్రిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవటం, ఆ పాత్రలో నటించిన నటీనటులు పెద్దగా గుర్తింపు ఉన్నవారు కాకపొవటంతో పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు.(సాక్షి రివ్యూస్)

సాంకేతిక నిపుణులు :
భలే భలే మొగాడివోయ్ సినిమాతో ట్రాక్ మార్చి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మారుతి, ఈ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. హీరో కు ఓ వ్యాధి, ఓ ప్రేమకథ, ఓ సమస్య ఇలా దాదాపు భలే భలే మొగాడివోయ్ కాన్సెప్ట్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే శర్వానంద్ ను ఓసీడీతో ఇబ్బంది పడే వ్యక్తిగా చూపించిన దర్శకుడు కావాల్సినంత వినోదం పంచాడు. కొన్ని సందర్భాలలో అతిగా అనిపించినా.. మంచి కామెడీతో అలరించాడు. కథాపరంగా కొత్తదనం లేకపోయినా.. టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయిన మహానుభావుడవేరా సాంగ్ విజువల్ గా మరింతగా అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) నిజర్ షఫీ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, ప్రతీ సన్నివేశం, రిచ్ గా కలర్ ఫుల్ గా కంటికింపుగా కనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
శర్వానంద్ నటన
కామెడీ

మైనస్ పాయింట్స్ :
కొత్తదనం లేకపోవటం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement