వంశీ పైడిపల్లి, ‘దిల్’ రాజు
‘‘మహేశ్ కెరీర్‌లో అత్యధిక షేర్ సాధించిన సినిమాగా ‘మహర్షి’ నిలిచింది. నైజాంలో ఇంకో రెండు, మూడు రోజుల్లో 30 కోట్ల షేర్‌ను టచ్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘ఎఫ్2’తో పెద్ద హిట్ సాధించాం. సమ్మర్‌లో ‘మహర్షి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాం. ఈ రెండు సక్సెస్‌లు ఇచ్చిన కిక్‌తో ఇంకో మూడు సినిమాలతో రాబోతున్నాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’.
వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన ‘మహర్షి’ సూపర్ హిట్‌గా నిలిచి 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నేను ఫస్ట్ టైమ్ ఇంకో రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లతో కలిసి పని చేయడానికి కారణం వంశీ కథ చెప్పినప్పుడు వచ్చిన ఎగై్జట్‌మెంట్. అదే నమ్మకంతో ఈ సినిమా బాధ్యత తీసుకున్నాను. ఒక సినిమా విషయంలో బాధ్యత తీసుకున్నప్పుడు ఆ సినిమా హిట్ అయితే వచ్చే కిక్కే వేరు. కొన్ని సినిమాలు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రం ’మహర్షి’.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రైతులను కలిసినప్పుడు ‘ఈ సినిమా తర్వాత రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశారు’ అని చెప్పినప్పుడు వచ్చిన సంతృప్తి ఎంత డబ్బు వచ్చినా రాదు. త్వరలోనే వంశీతో మరో సూపర్ హిట్‌కి రెడీ అవుతున్నాం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘వై.ఎస్. జగన్‌గారు, నేను స్కూల్‌మేట్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివాం. స్కూల్‌లో రెడ్ హౌజ్ కెప్టెన్‌గా వ్యవహరించేవారు. అప్పుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏపీ సీఎంగా జగన్‌గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ‘మహర్షి’ టీమ్ తరపున శుభాకాంక్షలు. నేనెప్పుడూ చూడనంత పెద్ద బ్లాక్ బస్టర్‌తో పాటు మహేశ్‌బాబు కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్ మూవీగా ‘మహర్షి’ నిలిచింది. మేం ఎక్కడికెళ్లినా మాకు ఒక గుర్తింపునిచ్చారు అని చెమర్చిన కళ్లతో రైతులు అంటున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment