సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఔదార్యం చూపింది. రెండు వారాల పాటు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. ఈనెల 9 నుంచి 22 వరకు ఉదయం 8-11 గంటల మధ్యలో ఒక షో అదనంగా ప్రదర్శించేందుకు తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజీవ్ త్రివేది మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. నిర్మాత దిల్ రాజు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి సినిమా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుథ, మీనాక్షి దీక్షిత్, రాజేంద్రప్రసాద్, ముఖేష్ రుషి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. కాగా, స్పెషల్ షోలకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నిర్మాతలు కోరినప్పటికీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
టిక్కెట్ ధరల పెంపు
మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో నగరంలోని సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 రూపాయలున్న టికెట్ ధరను110 రూపాయలకు పెంచగా, మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 50 రూపాయలు పెంచారు. అయితే టికెట్ ధరలను ప్రభుత్వ ఉత్తర్వులతోనే పెంచినట్లు యాజమాన్యాలు తెలిపాయి. పెరిగిన ధరలను ఈ శుక్రవారం నుంచి రెండు వారాలపాటు అమలు చేయనున్నట్లు వెల్లడించాయి. జీఎస్టీ, థియేటర్ నిర్వహణ ఖర్చులు భారం కావడంతో కొత్త సినిమాల విడుదల సందర్భంగా రెండు వారాలపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా. ఈ మేరకు అనుమతించిందని తెలిపాయి. నిబంధనలకు లోబడి టికెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం సూచించినట్టు పేర్కొన్నాయి.
మంత్రి తలసాని విస్మయం
సినిమా టికెట్ల ధరల పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 80 నుండి 110 రూపాయలు, మల్టిఫ్లెక్స్ థియేటర్ లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలువురు థియేటర్ల యాజమాన్యాలు చెప్పినట్లుగా వివిధ ప్రసార మాధ్యమాలలో చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కొనసాగించడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment