మహేష్ తప్పు చేశాడా..?
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ తన మార్కెట్ పరిధిని పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇతర భాషల్లో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ కలెక్షన్లను టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన అతడు, దూకుడు, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు తమిళ్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన బ్రహ్మోత్సవం సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు.
మహేష్కు తమిళ నాట కూడా మంచి మార్కెట్ ఏర్పడటంతో ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. అయితే ఈ సమయంలో మహేష్ హీరోగా తెరకెక్కిన తొలి సినిమాను తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. దాదాపు 18 ఏళ్ల తరువాత మహేష్ హీరోగా పరిచయం అయిన రాజకుమారుడు సినిమాను కోలీవుడ్లో జనవరి 27న రిలీజ్ అయ్యింది.
భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సూపర్ స్టార్, ఈ సమయంలో తన తొలి సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్కు అంగీకరించటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. రాజకుమారుడు సినిమాలో మహేష్ లుక్స్, నటన అంత మెచ్యూర్డ్గా కనిపించవు దీంతో మురుగదాస్ సినిమాకు ముందు ఈ సినిమా చూసిన ఆడియన్స్కు నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయినా మహేష్, రాజకుమారుడు రిలీజ్కు అంగీకరించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.