దుష్ట శిక్షణకుసంభవామి
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే – ‘‘సత్పురుషుల సంరక్షణకూ, దుష్టజన శిక్షణకూ, ధర్మ సంస్థాపన కోసం... ప్రతి యుగంలో నేను అవతరిస్తూనే ఉంటాను’’ అనేది ‘భగవద్గీత’లోని ఈ శ్లోకం తాత్పర్యం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 24 వరకూ మహేశ్, ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ చిత్రానికి ‘ఏజెంట్ శివ’తో పాటు పలు టైటిల్స్ వినిపించాయి. అయితే.. ధర్మసంస్థాపన కోసం దుష్టులను శిక్షించే ఓ పోలీసాఫీసర్ కథతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘సంభవామి’ టైటిల్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని చిత్ర బృందం భావించారట! రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా డిసెంబర్ 31న విడుదల చేస్తారని టాక్.