17 ఇయర్స్ ఇండస్ట్రీ..
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి శనివారానికి 17 ఏళ్లు పూర్తయ్యింది. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో 'రాజకుమారుడు' సినిమాతో తొలిసారి హీరోగా అలరించిన మహేష్.. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్కోలేదు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సూపర్ హిట్స్కు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. 1999 జూలై 30వ తేదీన రిలీజైన రాజకుమారుడు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ను నమోదు చేయటంతో పాటు మహేష్కు 'ప్రిన్స్' అనే పేరు కూడా ఫిక్స్ చేసింది. శనివారానికి ఆ సినిమా రిలీజై 17 ఏళ్లు పూర్తికావడంతో అభిమానులు అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అడుగుపెట్టినా తనదైన స్టైల్తో, నటనతో.. అన్నిటికీ మించి తనకి మాత్రమే సొంతమైన గ్లామరస్ లుక్తో టాలీవుడ్ను ఏలేస్తున్నాడు మహేష్. తెర మీద నటనతో పాటు, తెర వెనుక ఆయన వ్యక్తిత్వం కూడా మహేష్ స్టార్ డమ్ను మరింత పెంచిందని చెప్పొచ్చు. ఇప్పుడు మహేష్ అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్. యూత్ ఐకాన్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. సినిమా జయాపజయాలకు పూర్తిగా తనదే బాధ్యత అంటాడు మహేష్. స్టోరీ డిస్కషన్ సమయంలోనే తనకు నచ్చనప్పుడు దాన్ని వదిలేస్తే ఆ ప్రాజెక్టు ఫ్లాప్ కాదు కదా అన్నది ఆయన వాదన. తాను కన్విన్స్ అయిన తర్వాత ఆ సినిమా విజయవంతం అయినా, ఫ్లాపయినా తానే బాధ్యత వహిస్తానంటాడు. అదే ప్రిన్స్ స్పెషాలిటీ. ప్రస్తుతం మహేష్.. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఆ క్రేజీ ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.