
మలేసియాలో మహేష్ బాబు సందడి
సూపర్స్టార్ మహేష్ బాబు ఇప్పుడేం చేస్తున్నాడు? సినిమాలకు కాస్తంత విరామం ఇచ్చి, తన భార్య, పిల్లలతో హాయిగా మలేసియాలో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజులుగా సినిమాల్లో బిజీగా గడపడంతో కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోయిన ఈ హీరో, ఇప్పుడు పూర్తి సమయాన్ని వాళ్లకే అంకితం చేశాడు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితారలను తీసుకుని మలేషియా వెళ్లాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే తదుపరి చిత్రం షూటింగ్ మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ గ్యాప్ను కుటుంబానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. మహేష్ వచ్చేలోపు మిగిలిన నటులతో మరికొన్ని ముఖ్యమైన సీన్లను దర్శకుడు పూర్తి చేస్తున్నారని సినిమా వర్గాలు చెప్పాయి.
కొరటాల శివతో మహేష్ బాబు చేస్తున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, క్యారెక్టర్ నటుడు జగపతి బాబు కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'మగాడు' అని పేరు పెట్టినట్లు కథనాలు వచ్చాయి.