
మహేష్ మరో షాక్ ఇస్తున్నాడా..?
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన మహేష్ బాబు నుంచి.. ఆ ఫ్లాప్ను మరిపించే హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మహేష్ కూడా భారీ చిత్రాన్నే చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ స్పై థ్రిల్లర్గా స్పైడర్ సినిమాను చేస్తున్నాడు. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంత వరకు పూర్తి కాలేదు.
క్లైమాక్స్ విషయంలో దర్శకుడు సంతృప్తిగా లేకపోవటంతో చివరి నిమిషంలో మార్పులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన స్పైడర్ రిలీజ్ను మరోసారి వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ముందుగా స్పైడర్ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తరువాత ఆగస్టు 11ను వాయిదా వేశారన్న టాక్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ కోసమే నెలల తరబడి వెయిట్ చేయించిన స్పైడర్ టీం, ఇప్పడు రిలీజ్ విషయంలో కూడా వాయిదాల మీద వాయిదాలతో అభిమానులకు షాక్ ఇస్తున్నారు.