ఈ జన్మకు తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చాలు!
– చెన్నైలో జరిగిన ‘స్పైడర్’ ఆడియో వేడుకలో మహేశ్‌బాబు
మీరు చెన్నైలో పుట్టి, పెరిగారు. తమిళ్ బాగా వచ్చు. ఎప్పుడూ తమిళ సినిమా చేయాలనుకోలేదా? అనడిగితే... ‘‘భగవంతుడు తెలుగులో మంచి అభిమానులను ఇచ్చాడు. అక్కడ నేను పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నా. ఈ జన్మకు నాకది చాలు. తమిళంలో సినిమాలు చేయడం లేదనే కొరత లేదు.
ఇప్పుడీ సిన్మాతో 18 ఏళ్ల తర్వాత మళ్లీ నేను నటుడిగా (తమిళంలో తొలి సినిమా) పరిచయమవుతున్నట్టుంది. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాషల్లో సినిమా చేయడం తమషా కాదు. దర్శక–నిర్మాతలు ఎలాంటి టెన్షన్లు లేకుండా చేశారు’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన తెలుగు–తమిళ సినిమా ‘స్పైడర్’. ‘ఠాగూర్’ మధు చిత్రసమర్పకులు. హ్యరీస్ జయరాజ్ స్వరకర్త.
శనివారం చెన్నైలో తెలుగు, తమిళ పాటల్ని రిలీజ్ చేశారు. మురుగదాస్ మాట్లాడుతూ– ‘‘మహేశ్ మద్దతు లేకుండా ‘స్పైడర్’ను బైలింగ్వల్‌గా తీయడం సాధ్యమయ్యేది కాదు. మహేశ్‌కు సూపర్‌స్టార్ అనిపించుకోవడం ఇష్టం ఉండదు. ‘నన్ను మీరు సూపర్‌స్టార్ అని పిలవొద్దు. టైటిల్స్‌లోనూ వేయొద్దు. ఫ్యాన్స్ మనసులో ఎలాగూ ఉన్నాను. ఇక, ప్రత్యేకంగా చాటుకోవలసిన అవసరం లేదు’ అన్నారు మహేశ్’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు కార్డుపై మహేశ్‌ను చూసి... ‘చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు.
ఇప్పుడు స్టైలిష్‌గా, బాండ్‌లా ఉన్నాడు. లుక్ అదిరింది’ అని మెచ్చుకోవడం చూసి థ్రిల్ అయ్యా. ఆయన మహేశ్ గురించి చాలాసేపు మాట్లాడారు. ఈ సినిమాను తమిళంలో విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ‘లైకా ప్రొడక్షన్స్’ రాజుమహాలింగం. ‘‘మహేశ్, సూర్య, కార్తీ, దర్శకుడు వెంకట్‌ప్రభు, నేను... చెన్నైలో సేమ్ స్కూల్‌లో చదువుకున్నాం. మహేశ్‌తో తప్ప మిగతావాళ్లతో సిన్మాలు తీశా. మహేశ్‌తో తీయాలని నా కోరిక. తెలుగులో ‘గజని’ ఎంత హిట్టయ్యిందో ‘స్పైడర్’ అంతకు మించి హిట్టవుతుంది. సెప్టెంబర్ 27న వసూళ్ల సునామి రాబోతోంది’’ అన్నారు నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా.