నాపై అమలకు ఎంత ప్రేమో అర్థమైంది | Mahesh, Call me Nagarjuna | Sakshi
Sakshi News home page

నాపై అమలకు ఎంత ప్రేమో అర్థమైంది

Published Sat, Feb 11 2017 11:22 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాపై అమలకు ఎంత ప్రేమో అర్థమైంది - Sakshi

నాపై అమలకు ఎంత ప్రేమో అర్థమైంది

‘‘సినిమా చూసి ఇంటికి వెళ్లిన తర్వాత అమల గంటసేపు ఏడుస్తూనే ఉంది. తన మనసులో నాపై ఎంత ప్రేమ ఉందనేది అప్పుడు అర్థమైంది. నన్ను పట్టుకుని అలా నిలబడింది. ఆ మెమరబుల్‌ మూమెంట్స్‌ని ఎప్పటికీ మరచిపోలేను. నాకు అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు నాగార్జున. శ్రీవారి భక్తుడు హాథీరామ్‌ బావాజీగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’.  కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు కూడా సినిమా చూసి కళ్లు చెమర్చాయని చెప్పారు. బాగా చేశావని మెచ్చుకున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు కలిగిన  అనుభవాలను ఆయనతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పంచుకోబోతున్నాను. ఓ చక్కటి సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. రాఘవేంద్రరావుగారు, జేకే భారవిలు మూడు నాలుగేళ్లు కష్టపడి ఈ కథ తయారుచేశారు. టీమ్‌ అంతా కష్టపడి పనిచేశారు. అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు. ('ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ)


 రెండు కళ్లూ చాలవు: కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నేను ఏం ఆశించి ఈ సినిమా తీశానో, ఈ రోజు అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జన్మ ధన్యమైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. అందులో రెండు ఫోన్‌ కాల్స్‌ మరచిపోలేను. ‘ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది. ఇంత అద్భుతమైన సినిమా తీసిన మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా’ అన్నారొకరు. ఇంకొకరు ‘వెండితెరపై తిరుపతి పుణ్య క్షేత్రాన్ని ఆవిష్కరించిన మీకు జన్మంతా ఋణపడి ఉంటాం’ అన్నారు. భగవంతుడి విశ్వరూపం చూడడానికి రెండు కళ్లూ చాలవు. అదే విధంగా ఈ సినిమాలో కళ్లతోనే నటించిన నాగార్జున నటన చూడడానికీ రెండు కళ్లూ చాలవు. ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి కారణమైన మా నిర్మాత మహేశ్‌రెడ్డి, చిత్రబృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.

ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ చిత్రంతో నా జన్మ ధన్యమైంది. దీనికి కారకులైన నాగార్జున, రాఘవేంద్రరావులకు జీవితాంతం రుణపడి ఉంటాను. శుక్రవారం నుంచి బోలెడంత మంది అభినందిస్తున్నారు. ఈ అనుభూతిని మరచిపోలేను. రాఘవేంద్రరావు గారి దర్శకత్వం చూస్తుంటే ఆ స్వామివారితో నేను గడిపినట్టు అనిపిస్తోంది. ఏడు కొండల వెంకన్న సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. క్లైమాక్స్‌లో నలభై నిమిషాల పాటు నా కళ్లవెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. యువతరం నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కర్ని సినిమా అలరిస్తుంది.

రాఘవేంద్రరావుగారు ఓ టీటీడీ బోర్డు సభ్యునిగా భక్తుల ఇబ్బందులను చూసి, చలించి ఈ సినిమా తీశారనిపించింది. అంత అద్భుతంగా ఉందీ సినిమా. కీరవాణి సంగీతం, భారవి రచన, అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ల నటన.. అన్నీ ఆణిముత్యాలే’’ అన్నారు. ‘‘శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే నాకు ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత ఇంకో మూడు సినిమాలు వచ్చాయి. ఇదంతా స్వామివారి మహిమే. నాగార్జున, రాఘవేంద్రరావులకు నేను పెద్ద ఫ్యాన్‌. వాళ్ల కాంబినేషన్‌లో చేసిన ఈ సినిమా హిట్‌ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రగ్యా జైశ్వాల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement