బాలీవుడ్లో మహేష్ మూవీ
టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. వంద కోట్ల వసూళ్లతో టాలీవుడ్ సినిమా స్టామినా ప్రూవ్ చేసిన సూపర్ స్టార్, ప్రస్తుతం తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన ప్రతి సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫార్ములాతో శ్రీమంతుడు సినిమాకు భారీ కలెక్షన్లు సాధించిన మహేష్, తదుపరి సినిమాల విషయంలో మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడు.
మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఘనవిజయం సాదించటంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు శ్రీమంతుడు సినిమా ఇచ్చిన కిక్తో బ్రహ్మోత్సవాన్ని కూడా తెలుగుతో పాటు తమిళ్లోనూ తెరకెక్కిస్తున్న ప్రిన్స్, మలయాళంలోనూ డబ్బింగ్ వర్షన్ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టిన రాజకుమారుడు త్వరలో నార్త్లోనూ అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈసినిమాను తెలుగు తమిళ్తో పాటు హిందీలోనూ ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా తిరస్కరించిన మహేష్ ప్రస్తుతం మార్కెట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడట.
సోషల్ మెసేజ్తో భారీగా తెరకెక్కుతున్న మహేష్, మురుగదాస్ల సినిమాను ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈసినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతోపాటు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు చిత్రయూనిట్.