
సాలెగూళ్లో చిక్కారు!
సాలెగూడులో పడి ఎటూ వెళ్లలేక కొన్ని పురుగులు గిల గిల గింజుకుంటుంటే ఎలా ఉంటుందో... సేమ్ టు సేమ్ అలాంటి సిచ్యువేషనే మహేశ్‌బాబు ‘స్పైడర్’ సెట్‌లో కనిపిస్తోందట! మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ‘స్పై’... అదే సీక్రెట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగారు ‘స్పై’ అని తెలీక, కొందరు చీడ పురుగులు చాలా చాలా చెడు పనులు చేసేశారు. చివరకు, కథ కంచెకు చేరే టైమ్‌లో సాలీడులా మన ‘స్పై’ అల్లిన సాలెగూడు (ఉచ్చు)లో చిక్కుకుంటారు.
ఆ సాలెగూళ్లో చిక్కుకున్న బద్మాష్‌లకు సంబంధించిన సీన్లను ఇప్పుడు చెన్నైలో షూటింగ్ చేస్తున్నారు. ఈ 16న చెన్నైలో ‘స్పైడర్’ క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ వరకు క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందట! ఆ తర్వాత పాటల చిత్రీకరణకు ఫారిన్ వెళ్తారట! చెన్నై షెడ్యూల్‌లో హీరోతో పాటు సినిమాలో విలన్‌గా నటిస్తున్న దర్శకుడు ఎస్.జె. సూర్య తదితరులు పాల్గొంటున్నారు. రకుల్ íహీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు హ్యారీస్ జయరాజ్ స్వరకర్త.