
మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటవుతున్నారు?
విడిపోతున్నామంటూ ప్రకటించిన బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాలు మనసు మార్చుకున్నారా? మళ్లీ వాళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నారా? అంటే బాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. విడాకులు తీసుకునే విషయంలో అర్బాజ్, మలైకా పునరాలోచనలోపడ్డారని, కలసి జీవించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
మలైకాతో కలసి జీవించడానికి అర్బాజ్ మొదట్నుంచి ఇష్టంగానే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే విబేధాల కారణంగా మలైకా అతనికి దూరమైంది. విడాకులు తీసుకోబోతున్నట్టు ఇటీవల ఇద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. మలైకా తన పేరు చివరను ఖాన్ అన్న పదాన్ని కూడా తొలిగించింది. అయితే విడాకుల వరకు వెళ్లకుండా ఇద్దరూ రాజీపడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అర్బాజ్తో వివాహ బంధాన్ని కొనసాగించాలని మలైకాకు ఆమె తల్లి జాయ్సె, సోదరి, నటి అమృతా నచ్చచెప్పినట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మనసు మార్చుకున్న మలైకా.. వివాహబంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆమె త్వరలోనే అర్బాజ్ ఇంటికి వెళ్లనున్నట్టు సమాచారం.