
మహానటిలో మరో హీరోయిన్..!
అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమా రోజుకో వార్తతో ఆసక్తి కలిగిస్తోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ లాంటి తారలు నటిస్తున్నారు.
ఇటీవల సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి జంట విజయ్ దేవరకొండ, షాలిని పాండేలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈలిస్ట్ లో తాజాగా మరో హీరోయిన్ చేరింది. నాగ అశ్విన్ తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవికా నాయర్ మహానటిలో అతిథి పాత్రలో నటించనుందట. నిడివి తక్కువే అయినా.. మాళవిక పాత్ర ఎంతో కీలకమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెరనిండుగా తారలతో కనిపిస్తున్న మహానటిలో ముందు ముందు ఇంకెంత మంది తారలు తళుక్కుమంటారో చూడాలి.