ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ కన్నుమూత
కొచ్చి: ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ మణి(45) కన్నుమూశారు. కొంత కాలంగా లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కొచ్చిలో తుది శ్వాస విడిచారు. ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాధించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన కళాభవన్.. దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు.
విలనిజంలోనూ తనదైన కామెడీ ముద్రను కళాభవన్ వేశారు. ముఖ్యంగా తెలుగులో ఆయన నటించిన చిత్రం అనగానే గుర్తొచ్చేది జెమినీనే. జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు. ముఖ్యంగా' నా పేరే లడ్డా.. జెమినీకంటే పేద్ద రౌడీని' అంటూ పలికించిన సంభాషణలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కమేడియన్గా, విలన్గానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇక పలు మళయాల సినిమాల్లో హీరోగా కూడా నటించారు. తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడా అభిమానం సొంతం చేసుకున్నారు.
ఆటోడ్రైవర్ నుంచి ప్రముఖ విలక్షణ నటుడి స్థాయికి....
ఈయన పాపులర్ సింగర్ కూడా. సల్లాపం అనే చిత్రంలోని తన పాత్రకు అనూహ్యంగా గొప్ప పేరొచ్చి ఆయన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారుఉ. 1999లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. జాతీయ అవార్డుల్లో పోటీ పడ్డారు. లివర్ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. 'నటుడు కళాభవన్ శనివారం కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు' అని వైద్యులు తెలిపారు. కేరళలోని చలక్కుడి అనే ప్రాంతానికి చెందిన కళాభవన్ నటుడు కాకముందు ఆటో డ్రైవర్ గా చేసేవారు.