అల్లరిమొగుడి కామికల్ సీక్వెల్ | Mama Manchu Alludu Kanchu Movie Review | Sakshi
Sakshi News home page

అల్లరిమొగుడి కామికల్ సీక్వెల్

Published Fri, Dec 25 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

అల్లరిమొగుడి కామికల్ సీక్వెల్

అల్లరిమొగుడి కామికల్ సీక్వెల్

టైటిల్ : మామ మంచు అల్లుడు కంచు
జానర్ : కామెడీ ఎంటర్టైనర్
తారాగణం : మోహన్ బాబు,అల్లరి నరేష్, మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, అలీ
మాటలు : శ్రీదర్ సీపాన
సంగీతం : అచ్చు, రఘు కుంచె, కోటి
దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి
నిర్మాత : మంచు విష్ణు

ఇరవైమూడేళ్ళ నాటి ‘అల్లరి మొగుడు’ గుర్తుందా? హిట్టయిన ఆ సినిమా కథనూ, అదే హీరోయిన్లనూ తీసుకొని, దానికి కొనసాగింపుగా కామెడీగా అల్లుకున్న సీక్వెల్ ‘మామ మంచు-అల్లుడు కంచు’. కాకపోతే, మరాఠీ హిట్‌ను బేస్ చేసుకున్నారు. భక్తవత్సలంనాయుడు (మోహన్‌బాబు) కిద్దరు భార్యలు. మొదటి భార్య సూర్యకాంతం (మీనా)కో కూతురు శ్రుతి (పూర్ణ). రెండో భార్య ప్రియంవద (రమ్యకృష్ణ)కో కొడుకు గౌతవ్‌ు (వరుణ్‌సందేశ్). అయితే, ఒకరికొకరికి తెలీకుండా రెండిళ్ళ సెటప్‌ను గుట్టుగా నెట్టుకొస్తుంటాడు. ఇంతలో అతని కూతుర్ని ప్రేమిస్తాడు బాలరాజు (అల్లరి నరేశ్).

కానీ ఆ పెళ్ళి నాయుడికిష్టం ఉండదు. మరోపక్క కొడుకేమో నాయుడంటే పడని సన్యాసిరావు (కృష్ణభగవాన్) కూతురు దివ్య (సోనియా)ని ప్రేమి స్తాడు. ఆ పెళ్ళేమో నాయుడు ఎలాగైనా చేయాలి. దాంతో, ఇక డ్రామా ఆడడానికి స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) సాయం తీసుకుంటాడు. అప్పటి నుంచి కామెడీ ఆఫ్ ఎర్రర్‌‌స మొదలవుతుంది. కాబోయే అల్లుడు ‘కంచు’ కాదు, ‘మంచు’ అని మామకర్థమవుతుంది. ఏకకాలంలో అటు కూతురి పెళ్ళి, ఇటు కొడుకు పెళ్ళి నాయుడు చేయాల్సొస్త్తుంది. ఏం జరిగిందన్నది మిగతాకథ.
 
ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఫార్ములా సూపర్‌హిట్ బాక్సాఫీస్ సూత్రం. శోభన్‌బాబు (‘కార్తీకదీపం’) నుంచి వెంకటేశ్ (‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’), జగపతిబాబు దాకా అందరూ ఆ ఫార్ములానూ, ఇద్దరు భార్యల మధ్య నలిగే హీరో అవస్థనూ బాగానే వాడారు. ఈ సినిమాలో ఇప్పుడు దానికే, అల్లుడి ట్రాక్ అదనమైంది. నలభై ఏళ్ళ సినిమా కెరీర్ పూర్తయిన మోహన్‌బాబుకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. ఆయన తన కోర వయసులో వేసిన ఆ తరహా పాత్రల కామెడీని ఇప్పటికీ అవే హావభావాలతో చూపారు. తన విలక్షణ డైలాగ్ డెలివరీని ఆసరాగా చేసుకొని, రచయితలతో ఆ తరహా డైలాగులు రాయించారు. పలికారు.

‘మాయ్యా’ అంటూ అమాయకురాలైన భార్యగా మీనా, హుందాతనం నిండిన ఇల్లాలుగా రమ్యకృష్ణ కనిపిస్తారు. ‘అల్లరి’ నరేశ్‌కు కూడా ఈ తరహా కామెడీ అలవాటే. అలీ, కృష్ణభగవాన్ లాంటి వాళ్ళు ఎప్పటిలానే అవసరమనుకున్నప్పుడల్లా ఆంగిక, వాచికాలతో కాస్తంత శృంగారం ధ్వనించేలా చేశారు. కోటి నేపథ్య సంగీతం, ‘చెమ్మచెక్క...’ లాంటి ఒకటి రెండు పాటలు బాగున్నాయి.
 
ఫస్టాఫ్ అంతా కాబోయే మామా అల్లుళ్ళు మోహన్‌బాబు, అల్లరి నరేశ్‌ల మధ్య పిల్లి - ఎలుక చెలగాటం తరహా సీన్లు ఎక్కువ. అదే పద్ధతిలో చివరిదాకా వెళితే, ఒకలా ఉండేది. సెకండాఫ్‌కు వచ్చేసరికి మామ తన రెండు కాపురాల వ్యవహారం బయటపడకుండా ప్రయత్నించే వైపు కథ క్రమంగా మొగ్గుతుంది. కథ కొంత ఊహించదగినదే కాబట్టి, ఎంత ఆసక్తిగా కథనం ఉందన్న దాని మీదే దృష్టి అంతా నిలుస్తుంది. ఒకరికి ఇద్దరు ముగ్గురు

భక్తవత్సలంనాయుడు పాత్రలతో క్యారెక్టర్ల మధ్య జరిగే ఈ కన్‌ఫ్యూజింగ్ కామెడీ డ్రామా అచ్చం అందుకు తగ్గట్లే ఉంటుంది. ‘‘ఏమిటయ్యా ఈ కన్‌ఫ్యూజన్?’’ అని ఒకచోట కృష్ణ భగవాన్‌తో అనిపిస్తారు కూడా. అయితే, అంతా వినోదంలో భాగమే అని సరిపెట్టుకోవాలి. మొత్తం మీద ఈ గుడుగుడు గుంజాలాటలో బోలెడన్ని పాత్రలొస్తుంటాయి. నటీనటులు ఆలోచించే గ్యాప్ ఇవ్వకుండా తెరపై నిండుగా కనిపిస్తుంటారు. మొత్తానికి, ఇప్పటికే 500 చిత్రాలు దాటిపోయిన మోహన్‌బాబు కెరీర్‌లో అదనంగా మరో సినిమా, నరేశ్‌కు 50వ సినిమా అయిన ఈ మామా అల్లుళ్ళ డ్రామా మళ్ళీ పాత సినిమాల్ని గుర్తుకుతెస్తుంది. అలాంటివి ఇష్టపడితే... వినోద భక్తవత్సలమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement