mama manchu alludu kanchu
-
నేడు తిరుపతికి ‘మామ మంచు అల్లుడు కంచు’ యూనిట్
తిరుపతి కల్చరల్: ఇటీవల విడుదలై విశేషాదరణ పొందిన ‘మామ మంచు అల్లుడు కంచు’ సక్సెస్ మీట్‌ను శనివారం తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మోహన్‌బాబు యువసేన రాష్ట్ర నేత ఎం.సునీల్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరంలో స్విమ్స్‌కు ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సక్సెట్ మీట్ వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హీరో మోహన్‌బాబు, అల్లరి నరేష్, హీరోయిన్ పూర్ణ, రమ్యకృష్ణ, మీనా, ఆలీ, బ్రహ్మానందం, నిర్మాత మంచు విష్ణు, చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా మంచు లక్ష్మీ, మంచు మనోజ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అభిమానులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
అల్లరి మామ
-
అల్లరిమొగుడి కామికల్ సీక్వెల్
టైటిల్ : మామ మంచు అల్లుడు కంచు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : మోహన్ బాబు,అల్లరి నరేష్, మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, అలీ మాటలు : శ్రీదర్ సీపాన సంగీతం : అచ్చు, రఘు కుంచె, కోటి దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి నిర్మాత : మంచు విష్ణు ఇరవైమూడేళ్ళ నాటి ‘అల్లరి మొగుడు’ గుర్తుందా? హిట్టయిన ఆ సినిమా కథనూ, అదే హీరోయిన్లనూ తీసుకొని, దానికి కొనసాగింపుగా కామెడీగా అల్లుకున్న సీక్వెల్ ‘మామ మంచు-అల్లుడు కంచు’. కాకపోతే, మరాఠీ హిట్‌ను బేస్ చేసుకున్నారు. భక్తవత్సలంనాయుడు (మోహన్‌బాబు) కిద్దరు భార్యలు. మొదటి భార్య సూర్యకాంతం (మీనా)కో కూతురు శ్రుతి (పూర్ణ). రెండో భార్య ప్రియంవద (రమ్యకృష్ణ)కో కొడుకు గౌతవ్‌ు (వరుణ్‌సందేశ్). అయితే, ఒకరికొకరికి తెలీకుండా రెండిళ్ళ సెటప్‌ను గుట్టుగా నెట్టుకొస్తుంటాడు. ఇంతలో అతని కూతుర్ని ప్రేమిస్తాడు బాలరాజు (అల్లరి నరేశ్). కానీ ఆ పెళ్ళి నాయుడికిష్టం ఉండదు. మరోపక్క కొడుకేమో నాయుడంటే పడని సన్యాసిరావు (కృష్ణభగవాన్) కూతురు దివ్య (సోనియా)ని ప్రేమి స్తాడు. ఆ పెళ్ళేమో నాయుడు ఎలాగైనా చేయాలి. దాంతో, ఇక డ్రామా ఆడడానికి స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) సాయం తీసుకుంటాడు. అప్పటి నుంచి కామెడీ ఆఫ్ ఎర్రర్స మొదలవుతుంది. కాబోయే అల్లుడు ‘కంచు’ కాదు, ‘మంచు’ అని మామకర్థమవుతుంది. ఏకకాలంలో అటు కూతురి పెళ్ళి, ఇటు కొడుకు పెళ్ళి నాయుడు చేయాల్సొస్త్తుంది. ఏం జరిగిందన్నది మిగతాకథ. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఫార్ములా సూపర్‌హిట్ బాక్సాఫీస్ సూత్రం. శోభన్‌బాబు (‘కార్తీకదీపం’) నుంచి వెంకటేశ్ (‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’), జగపతిబాబు దాకా అందరూ ఆ ఫార్ములానూ, ఇద్దరు భార్యల మధ్య నలిగే హీరో అవస్థనూ బాగానే వాడారు. ఈ సినిమాలో ఇప్పుడు దానికే, అల్లుడి ట్రాక్ అదనమైంది. నలభై ఏళ్ళ సినిమా కెరీర్ పూర్తయిన మోహన్‌బాబుకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. ఆయన తన కోర వయసులో వేసిన ఆ తరహా పాత్రల కామెడీని ఇప్పటికీ అవే హావభావాలతో చూపారు. తన విలక్షణ డైలాగ్ డెలివరీని ఆసరాగా చేసుకొని, రచయితలతో ఆ తరహా డైలాగులు రాయించారు. పలికారు. ‘మాయ్యా’ అంటూ అమాయకురాలైన భార్యగా మీనా, హుందాతనం నిండిన ఇల్లాలుగా రమ్యకృష్ణ కనిపిస్తారు. ‘అల్లరి’ నరేశ్‌కు కూడా ఈ తరహా కామెడీ అలవాటే. అలీ, కృష్ణభగవాన్ లాంటి వాళ్ళు ఎప్పటిలానే అవసరమనుకున్నప్పుడల్లా ఆంగిక, వాచికాలతో కాస్తంత శృంగారం ధ్వనించేలా చేశారు. కోటి నేపథ్య సంగీతం, ‘చెమ్మచెక్క...’ లాంటి ఒకటి రెండు పాటలు బాగున్నాయి. ఫస్టాఫ్ అంతా కాబోయే మామా అల్లుళ్ళు మోహన్‌బాబు, అల్లరి నరేశ్‌ల మధ్య పిల్లి - ఎలుక చెలగాటం తరహా సీన్లు ఎక్కువ. అదే పద్ధతిలో చివరిదాకా వెళితే, ఒకలా ఉండేది. సెకండాఫ్‌కు వచ్చేసరికి మామ తన రెండు కాపురాల వ్యవహారం బయటపడకుండా ప్రయత్నించే వైపు కథ క్రమంగా మొగ్గుతుంది. కథ కొంత ఊహించదగినదే కాబట్టి, ఎంత ఆసక్తిగా కథనం ఉందన్న దాని మీదే దృష్టి అంతా నిలుస్తుంది. ఒకరికి ఇద్దరు ముగ్గురు భక్తవత్సలంనాయుడు పాత్రలతో క్యారెక్టర్ల మధ్య జరిగే ఈ కన్ఫ్యూజింగ్ కామెడీ డ్రామా అచ్చం అందుకు తగ్గట్లే ఉంటుంది. ‘‘ఏమిటయ్యా ఈ కన్ఫ్యూజన్?’’ అని ఒకచోట కృష్ణ భగవాన్‌తో అనిపిస్తారు కూడా. అయితే, అంతా వినోదంలో భాగమే అని సరిపెట్టుకోవాలి. మొత్తం మీద ఈ గుడుగుడు గుంజాలాటలో బోలెడన్ని పాత్రలొస్తుంటాయి. నటీనటులు ఆలోచించే గ్యాప్ ఇవ్వకుండా తెరపై నిండుగా కనిపిస్తుంటారు. మొత్తానికి, ఇప్పటికే 500 చిత్రాలు దాటిపోయిన మోహన్‌బాబు కెరీర్లో అదనంగా మరో సినిమా, నరేశ్‌కు 50వ సినిమా అయిన ఈ మామా అల్లుళ్ళ డ్రామా మళ్ళీ పాత సినిమాల్ని గుర్తుకుతెస్తుంది. అలాంటివి ఇష్టపడితే... వినోద భక్తవత్సలమవుతుంది. -
'మామ మంచు అల్లుడు కంచు' మూవీ రివ్యూ
టైటిల్ : మామ మంచు అల్లుడు కంచు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : మోహన్ బాబు,అల్లరి నరేష్, మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, అలీ మాటలు : శ్రీదర్ సీపాన సంగీతం : అచ్చు, రఘు కుంచె, కోటి దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి నిర్మాత : మంచు విష్ణు చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ హీరోగా, సీనియర్ హీరో మోహన్ బాబు మరో లీడ్ రోల్లో తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మామ మంచు అల్లుడు కంచు. మరాఠిలో ఘనవిజయం సాధించిన సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. అల్లరి నరేష్ 50వ సినిమాగా, మోహన్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత విడుదలైన సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన మామ మంచు అల్లుడు కంచు. రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకుందా..? హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ సక్సెస్ సాధించాడా,? చాలా కాలం తరువాత కామెడీ పాత్రలో నటించిన మోహన్ బాబు ఈ జనరేషన్‌ను తన టైమింగ్ తో మెప్పించాడా..? వివరాల్లోకి వెళితే... కథ : భక్తవత్సలం నాయుడు( మోహన్ బాబు) అనుకోని పరిస్థితుల్లో రెండు పెళ్ళిలు చేసుకొని పాతికేళ్లుగా ఒకరి తెలియకుండా ఒకరిని మెయిన్‌టెయిన్ చేయడానికి కష్టపడిపోతుంటాడు. అతని స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఈ కష్టాల్లో నాయుడుగారికి సాయం చేస్తుంటాడు. భక్తవత్సలం నాయుడు మొదటి భార్య సూర్యకాంతం (మీనా) కి ఒక కూతురు శృతి(పూర్ణ), రెండో భార్య ప్రియంవద(రమ్యకృష్ణ)కు ఓ కొడుకు గౌతమ్ నాయుడు(వరుణ్ సందేశ్). ఇలా కష్టాల్లో సాగుతున్న భక్తవత్సలం నాయుడుకి పిల్లలు పెళ్లీడుకి రావటంతో కొత్త కష్టాలు మొదలవుతాయి. శృతి, గౌతమ్‌ల పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావటంతో సినిమా అసలు కథలోకి ఎంటర్ అవుతుంది. ఇద్దరు పిల్లలకు పుట్టినరోజు కానుకలు ఇచ్చే క్రమంలో అడ్రస్‌లు మారిపోవటంతో శృతి గిఫ్ట్, గౌతమ్‌కు, గౌతమ్ గిఫ్ట్ శృతికి వెళుతుంది. గిఫ్ట్ మార్చుకోవటం కోసం శృతి, గౌతమ్‌లు కలుసుకోవాలనుకుంటారు. అలా కలిస్తే తన నాటకం బయటపడుతుందని భావించిన నాయుడు వారు కలవకుండా ఉండేదుకు గౌతమ్ గిఫ్ట్ దొంగతనం చేసి దాన్ని బాలరాజు (అల్లరి నరేష్) తో శృతి దగ్గరకు పంపిస్తాడు. ఎలాగైనా గౌతమ్ అంటే శృతికి అసహ్యం కలిగేలా చేయమంటాడు. శృతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ బాలరాజు, తానే గౌతమ్ అని శృతిని ప్రేమలోకి దించుతాడు. అలా మరింత కష్టాల్లో ఇరుక్కున్న నాయుడు, బాలరాజు నుంచి తన కూతురిని కాపాడుకోవటానికి, తన ఇద్దరు భార్యల రహస్యం బయటపడకుండా ఉండటానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. చివరకు ఆ విషయం ఎలా బయటపడింది. అనుకున్నట్టుగా బాలరాజు శృతి పెళ్లి చేసుకున్నాడా అన్నదే అసలు కథ. నటీనటులు : ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు గడుస్తున్నా మోహన్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటిపడి నటిస్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ క్యారెక్టర్‌ను ఎంచుకున్న మోహన్ బాబు ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించీ ఇప్పటికీ తనలో అదే ఫాం ఉందని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక తనకు బాగా అలవాటైన క్యారెక్టర్లో అల్లరి నరేష్ మరోసారి మెప్పించాడు. కామెడీతో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో కనిపించిన అలీ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మీనా, రమ్యకృష్ణ, పూర్ణ, వరుణ్ సందేశ్, కృష్ణభగవాన్‌లు తన పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌తో పాటు, మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా మామ మంచు అల్లుడు కంచు. నరేష్ 50 వ సినిమా కావటం, మోహన్ బాబు చాలా రోజులు తరువాత టిపికల్ కామెడీ క్యారెక్టర్ చేస్తుండటంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. మరాఠి సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేయటంలో విజయం సాధించాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి క్లారిటీ మెయిన్ టెయిన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి, కన్ఫ్యూజింగ్ సీన్స్ లోనూ ఎక్కడ క్లారిటీ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల కాలం వరుస సక్సెస్‌లు సాధిస్తున్న మాటల రచయిత శ్రీధర్ సీపాన మరోసారి తన పెన్ను పవర్ చూపించాడు. కామెడీ పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆకట్టుకోలేకపోయిన ఒకే ఒక్క అంశం సంగీతం. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినా.. థియేటర్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండే పాట ఒక్కటీ ఇవ్వలేకపోయారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : మోహన్ బాబు, అల్లరి నరేష్ యాక్టింగ్ కామెడీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : సాంగ్స్ ఓవరాల్‌గా మామ మంచు అల్లుడు కంచు మోహన్ బాబు, అల్లరి నరేష్‌లకు మంచి సక్సెస్ ఇవ్వటమే కాకుండా కొత్త సంవత్సరానికి నవ్వులతో స్వాగతం పలుకుతోంది. -
ఆ తప్పు ఎప్పుడూ చేయను: మోహన్ బాబు
చాలా రోజుల తరువాత ఫుల్‌లెంగ్త్ కామెడీ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సీనియర్ యాక్టర్ మోహన్ బాబు అభిమానులతో ముచ్చటించారు. ముందుగా చెప్పినట్టుగా గురువారం ఉదయం ట్వీట్టర్లో అందుబాటులోకి వచ్చిన మోహన్ బాబు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శుక్రవారం రిలీజ్ అవుతున్న 'మామ మంచు అల్లుడు కంచు' సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అల్లరి నరేష్‌తో కలిసి వర్క్ చేయటం ఎంతో ఆనందంగా ఉందన్న మోహన్ బాబు, 'ఈ జనరేషన్ హీరోలలో నా అభిమానులు నటులు మా అబ్బాయిలే. సరైన కథ దొరికితే లక్ష్మీతో కలిసి నటిస్తాను, కథ కోసమే ఎదురుచూస్తున్నాం. ముందుతరంలో ఎంతో మంచి నటులున్నారు, అప్పట్లో అలాంటి పాత్రలు కూడా ఉండేవి, నా సినిమాలన్నింట్లో బాగా నచ్చినవి చెప్పటం కష్టం. రాయలసీమ రామన్న చౌదరి, ఎమ్ ధర్మరాజు ఎమ్ఎ లాంటి చిత్రాలు చాలా ఇష్టం. విద్యానికేతన్ ద్వారా ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాజకీయాల ద్వారా సేవ అసాధ్యం. నేను దర్శకత్వం వహించే తప్పు ఎప్పుడు చేయను'. అంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మోహన్ బాబు, అల్లరి నరేష్ లీడ్ రోల్స్‌లో నటించిన మామ మంచు అల్లుడు కంచు సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా కాలం తరువాత మీనా, రమ్యకృష్ణలు మోహన్ బాబుకు జంటగా నటించారు. కోటి సంగీతం అందించిన ఈ సినిమా సక్సెస్‌పై చిత్రయూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. -
‘అద్దంలో ముఖం చూసుకున్నావా’ అనడిగారు!
‘‘నా 50వ సినిమా ‘సుడిగాడు-2’ అయితే బాగుంటుందనుకున్నా. అది కాకపోతే హారర్ కామెడీ మూవీ చేద్దామనుకున్నా. హారర్ కామెడీకి ఫిక్స్ అయిన తరుణంలో ‘మామ మంచు-అల్లుడు కంచు’ ఛాన్స్ వచ్చింది’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు, రమ్యకృష్ణ, మీనా, ‘అల్లరి’ నరేశ్, పూర్ణ కాంబినేషన్లో మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేశ్ మనోగతం... ఇందులో మోహన్‌బాబు గారు, నేను టామ్ అండ్ జెర్రీలా ప్లాన్స్ వేసుకుంటూ నవ్విస్తుంటాం. ‘మోహన్ బాబుతో నటిస్తున్నావు కదా... భయమేసిందా?’ అని చాలామంది అడిగారు. ఆయనంటే భయం కన్నా గౌరవం ఎక్కువ. ‘సీన్ చేసేటప్పుడు ఇంప్రొవైజేషన్స్ చేస్తుంటా. అలా చేయొచ్చా? లేక డెరైక్టర్ చెప్పింది ఫాలో కావాలా’ అని ఆయనను అడిగితే, ఇంప్రొవైజేషన్స్ చే స్తేనే బాగుంటుందన్నారు. దాంతో మా ఇద్దరికీ బాగా సింక్ అయింది. రఘువరన్‌లా విలన్ అవుదామని వచ్చాను. ‘అల్లరి’ ముందు అయితే ‘నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?’ అని కూడా అడిగారు. ‘నిర్మాత అయిపో... లేదా డెరైక్టర్‌గా ట్రై చేయ్’ అనేవాళ్లు. ‘మీ అన్నయ్యే బాగుంటాడు’ అని ముఖం మీదే అనేసేవారు. ‘అల్లరి’ అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని సందేహపడ్డా. కానీ నా అదృష్టం. ప్రేక్షకులకు నేను నచ్చాను. నాన్నగారు ఉన్నప్పుడు నాతో సినిమాలు చేసేవారు కాబట్టి కాస్త బ్యాలెన్సింగ్‌గా ఉండేది. ఆయన లేకపోయేసరికి ఇప్పుడు నా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఫోకస్‌లోకి వస్తున్నాయి. నాన్నగారు నా కథలు వినేవారు కాదు. నన్నే నిర్ణయం తీసుకోమనేవారు. ‘సినిమా బాగోకపోతే జీవితాంతం నన్నే తిడతావ్? హిట్టో.. ఫ్లాపో.. మొత్తం క్రెడిట్ నీదే’ అనేవారు. ఇప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. అందుకే హీరోలు కామెడీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్లు కామెడీ చేస్తున్నారని నాకు అవకాశాలు తగ్గవు. ఇండస్ట్రీలో ఎవరికి ఉండాల్సిన ప్లేస్ వాళ్లకి ఉంటుంది. రాజేంద్రప్రసాద్ ఎంత స్థానం ఉందో డెఫినెట్‌గా అంత కాకపోయినా కొంతైనా నాకు ఉందనుకుంటున్నాను. కథల విషయంలో నా భార్య విరూప సలహాలివ్వదు. సినిమాల మీద తనకంత అవగాహన లేదు. విరూప ఆర్కిటెక్ట్. మొన్నటి వరకు జాబ్ చేసేది. ఇప్పుడు సొంతంగా ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆమె ప్లాన్. -
'రెండు జతల బట్టలతో మద్రాసు వెళ్లాను’
తిరుపతి : డిసెంబర్ 25న జనం ముందుకు రా నున్న ‘మామమంచు- అల్లుడు కంచు’ సినిమా కుటుంబానికి వినోదాన్ని అందించే మంచి సినిమా అని పద్మశ్రీ డాక్టర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ శనివారం రాత్రి తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మో హన్ బాబు మాట్లాడుతూ తన నట జీవితంలో 560 సినిమాల్లో నటించానన్నారు. సినీ జీవితం లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాలో నటించినట్టు చెప్పారు. పిల్లలు పెద్దవారు కావడంతో బాధ్యతలన్నీ వారికి అప్పగిం చినట్టు చెప్పారు. ఏడాదిలో ఏదో ఒక సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమాలో నటిం చినట్టు చెప్పారు. నాతోపాటు మరో నటుడు కావాలనుకున్నప్పుడు ఈ పాత్రకు అల్లరి నరేష్ కరెక్టని మంచు విష్ణు అతన్ని తీసుకువచ్చాడన్నారు. ఆ పాత్రకు అల్లరి నరేష్ న్యాయం చేశారన్నారు. ఇద్దరం పోటీపడి నటించామన్నారు. ఏదో సాధించాలని రెండు జతల బట్టలతో మద్రాసుకు వెళ్లానన్నారు. అయితే ఆదిలోనే నువ్వు చిత్తూరు వాడివి, నీకు భాషరాదని అగౌరవ పరచారన్నారు. అయినా ధైర్యంగా ముందుకు సాగి, నటుడుగా శిఖరాగ్రాన్ని చేరుకున్నానన్నా రు. నా తర్వాత నా తమ్ముడు మోహన్‌బాబే డైలాగ్ చెప్పడంలో దిట్టని అన్నగారు ఎన్టీఆర్ చేత శభాష్ అనిపించుకున్నానన్నారు. నా ఊపి రి, శ్వాస, ధ్యాస, చివరకు నేను తినే తిండి సినిమాలేనని అన్నారు. సినిమా నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ కథ, సంగీతం, దీనికి తోడు మోహన్‌బాబు, అల్లరినరేష్ నటన సినిమాకు పెద్ద హైలెట్ అని తెలిపారు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని అభిప్రాయపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తండ్రి సమానులైన మోహన్‌బాబు జిల్లా వాసికావడం మనందరి గౌరవాన్ని పెం చిందన్నారు. కేవలం సినీ దిగ్గజమే కాక ఆయనలో మంచి రాజకీయవేత్త, పారిశ్రామిక వేత్త, విద్యావేత్తగా ఉన్నత శిఖరాలను చేరుకున్న వ్యక్తి అని కొనియాడారు. అనంతరం సినీ టెక్నీషియన్లు, ఇతర నటులు నటులకు జ్ఞాపికలు అందజేశారు. సినిమా ట్రైలర్‌ను మంచు మనోజ్ ఆవిష్కరించారు. -
అటు చామంతి... ఇటు పూబంతి
‘ముద్దిమ్మంది ఓ చామంతీ... మనసిమ్మంది ఓ పూబంతి...’ అంటూ రమ్యకృష్ణ, మీనాతో ‘అల్లరి మొగుడు’లో మోహన్‌బాబు చేసిన రొమాన్స్ అప్పట్లో ప్రేక్షకులకు కనువిందు. ఆ పాటలో ముగ్గురూ చూడముచ్చటగా అనిపిస్తారు. ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ ప్రాజెక్ట్‌కి భారీ ఎత్తున క్రేజ్ నెలకొనడం ఖాయం. ఈ ముగ్గురికీ ‘అల్లరి’ నరేశ్ కూడా తోడైతే ఇక చెప్పడానికి ఏముంటుంది...! రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్... ఇలా అన్ని అంశాలతో ఫుల్‌మీల్స్ లాంటి సినిమా తయారై ఉంటుందని ఊహించవచ్చు. ‘మామ మంచు - అల్లుడు కంచు’ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ - ‘‘సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. కోటి, అచ్చు, రఘు కుంచె అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది’’ అన్నారు. నరేశ్‌తో పూర్ణ జత కట్టిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: బాల మురుగన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ. -
మామ మంచు అల్లుడు కంచు ఆడియో హైలెట్స్
-
‘మామ మంచు - అల్లుడు కంచు’ పాటల వేడుక
-
ఇది అల్లరి మొగుడు-2లా ఉంటుంది -మంచు విష్ణు
మోహన్‌బాబు, అల్లరి నరేశ్ కథానాయకులుగా 24 ఫ్రేమ్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రం ‘మామ మంచు - అల్లుడు కంచు’. మీనా, రమ్యకృష్ణ, పూర్ణ కథానాయికలు. కోటి, అచ్చు, రఘు కుంచె స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం పాటలను పార్లమెంట్ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ఆవిష్కరించి, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాళ్ళ మాటల్లోనే... నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేశాడు! - మోహన్‌బాబు ఒక మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్ తీయాలని ఏడాదిన్నర పాటు నన్ను వెంటాడారు కో డెరైక్టర్ రవి. అలా ఈ సినిమా తెర మీదకు కొచ్చింది. రమ్యకృష్ణను హీరోయిన్గా తీసుకోవద్దని చాలామంది చెప్పారు. అప్పట్లో ఆ అమ్మాయి కారణంగా కలిసొచ్చి, ‘అల్లుడుగారు’ హిట్ అయ్యుండవచ్చు. మీనా డేట్స్ ‘అల్లరి మొగుడు’ టైంలో దొరకలేదు. దర్శకుడు క్రాంతికుమార్ గారు సంపాదించారు. వీరిద్దరూ నాకు బంగారం లాంటి వాళ్లు. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈవీవీ సత్యనారాయణ గారంటే నాకు చాలా అభిమానం. ఆయన వారసుడు నరేశ్ ఈ సినిమాలో నన్ను డామినేట్ చేయాలని చూశాడు. నేను కూడా అతనికి పోటీగా చేశా. ఆయనతో సినిమా అంటే భయమేసింది - శ్రీనివాస రెడ్డి మోహన్‌బాబు గారితో సినిమా అంటే భయమేసింది. కానీ సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ఇక ‘అల్లరి మొగుడు’ కాంబినేషన్‌ను ఈ సినిమాలో రిపీట్ చేశాం. వాళ్ళను ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది - విష్ణు నరేశ్ చేయాల్సిన పాత్ర నాదే. నేను చేస్తే నాన్నగారు చేయలేరు. అందుకే నరేశ్‌ని అడిగా. ఇది ‘అల్లరి మొగుడు’ పార్ట్-2లా ఉంటుంది. రమ్యకృష్ణ, మీనా గార్లను ఈ సినిమా కోసం ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది. నాన్నగారు హాయిగా సినిమాలో నటించడానికి కారణం అలీగారే. మా కామెడీ రచ్చరంబోలా - అల్లరి నరేశ్ మోహన్‌బాబు గారిది, నాది - మా ఇద్దరి కామెడీ టైమింగ్ రచ్చ రంబోలా. ఇండస్ట్రీకి వచ్చాక ఐదు సినిమాలు చేస్తానా అనుకున్నా. 50 చేశా. ఇలాంటి మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం! - అంబరీష్ లైఫ్‌లో డబ్బులు సంపాదించడం కష్టం కాకపోవచ్చేమో కానీ మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం. అలాంటి మిత్రుడే మోహన్‌బాబు. ‘అల్లుడు గారు’ లేకపోతే... - రమ్యకృష్ణ నా ఫస్ట్ హిట్ ‘అల్లుడుగారు’. అది లేకపోతే ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదేమో. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా వద్దనుకున్నా! - మీనా అసలు ఈ సినిమా వద్దనుకున్నా. నాకు పాప ఉందని చెప్పా. మోహన్‌బాబుగారు, విష్ణుగారు ఇచ్చిన భరోసాతో ఈ సినిమాలో చేశాను. ఈ వేడుకలో సుబ్బరామిరెడ్డి, బ్రహ్మానందం, కోటి, సుమలత, బి. గోపాల్ తదిత రులు పాల్గొన్నారు. -
కంచు లాంటి అల్లుడు
‘అల్లరి’ నరేశ్ సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. సోలోగా కామెడీ చేసి, ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన నరేశ్ తన 50వ సినిమా ‘మామ మంచు - అల్లుడు కంచు’లో డా. మోహన్ బాబుతో కలిసి తెర మీద సందడి చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు సరసన రమ్యకృష్ణ, మీనా కథానాయికలు. నరేశ్ సరసన పూర్ణ నటించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ. -
జోరుగా 'మామ మంచు అల్లుడు కంచు'
తిరుపతి : తమ బ్యానర్లో రూపొందుతున్న 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోందని ప్రముఖ నటుడు మోహన్ బాబు తెలిపారు. ఆయన నిన్న కన్నడ నటుడు అంబరీష్, సుమలత దంపతులు, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ అంబరీష్‌తో తనకు 45 ఏళ్లుగా స్నేహం ఉందన్నారు. ఆయన కోరిక మేరకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. అంబరీష్ మాట్లాడుతూ జీవితంలో ఆస్తులు, డబ్బు కన్నా మంచి స్నేహితుడిని పొందటమే గొప్పన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేదని, స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.