‘అద్దంలో ముఖం చూసుకున్నావా’ అనడిగారు!
‘‘నా 50వ సినిమా ‘సుడిగాడు-2’ అయితే బాగుంటుందనుకున్నా. అది కాకపోతే హారర్ కామెడీ మూవీ చేద్దామనుకున్నా. హారర్ కామెడీకి ఫిక్స్ అయిన తరుణంలో ‘మామ మంచు-అల్లుడు కంచు’ ఛాన్స్ వచ్చింది’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు, రమ్యకృష్ణ, మీనా, ‘అల్లరి’ నరేశ్, పూర్ణ కాంబినేషన్‌లో మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేశ్ మనోగతం...
-
ఇందులో మోహన్‌బాబు గారు, నేను టామ్ అండ్ జెర్రీలా ప్లాన్స్ వేసుకుంటూ నవ్విస్తుంటాం. ‘మోహన్ బాబుతో నటిస్తున్నావు కదా... భయమేసిందా?’ అని చాలామంది అడిగారు. ఆయనంటే భయం కన్నా గౌరవం ఎక్కువ. ‘సీన్ చేసేటప్పుడు ఇంప్రొవైజేషన్స్ చేస్తుంటా. అలా చేయొచ్చా? లేక డెరైక్టర్ చెప్పింది ఫాలో కావాలా’ అని ఆయనను అడిగితే, ఇంప్రొవైజేషన్స్ చే స్తేనే బాగుంటుందన్నారు. దాంతో మా ఇద్దరికీ బాగా సింక్ అయింది.
-
రఘువరన్‌లా విలన్ అవుదామని వచ్చాను. ‘అల్లరి’ ముందు అయితే ‘నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?’ అని కూడా అడిగారు. ‘నిర్మాత అయిపో... లేదా డెరైక్టర్‌గా ట్రై చేయ్’ అనేవాళ్లు. ‘మీ అన్నయ్యే బాగుంటాడు’ అని ముఖం మీదే అనేసేవారు. ‘అల్లరి’ అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని సందేహపడ్డా. కానీ నా అదృష్టం. ప్రేక్షకులకు నేను నచ్చాను. నాన్నగారు ఉన్నప్పుడు నాతో సినిమాలు చేసేవారు కాబట్టి కాస్త బ్యాలెన్సింగ్‌గా ఉండేది. ఆయన లేకపోయేసరికి ఇప్పుడు నా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఫోకస్‌లోకి వస్తున్నాయి. నాన్నగారు నా కథలు వినేవారు కాదు. నన్నే నిర్ణయం తీసుకోమనేవారు. ‘సినిమా బాగోకపోతే జీవితాంతం నన్నే తిడతావ్? హిట్టో.. ఫ్లాపో.. మొత్తం క్రెడిట్ నీదే’ అనేవారు.
-
ఇప్పుడు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారు. అందుకే హీరోలు కామెడీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్లు కామెడీ చేస్తున్నారని నాకు అవకాశాలు తగ్గవు. ఇండస్ట్రీలో ఎవరికి ఉండాల్సిన ప్లేస్ వాళ్లకి ఉంటుంది. రాజేంద్రప్రసాద్ ఎంత స్థానం ఉందో డెఫినెట్‌గా అంత కాకపోయినా కొంతైనా నాకు ఉందనుకుంటున్నాను.
-
కథల విషయంలో నా భార్య విరూప సలహాలివ్వదు. సినిమాల మీద తనకంత అవగాహన లేదు. విరూప ఆర్కిటెక్ట్. మొన్నటి వరకు జాబ్ చేసేది. ఇప్పుడు సొంతంగా ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆమె ప్లాన్.