ఇది అల్లరి మొగుడు-2లా ఉంటుంది -మంచు విష్ణు
మోహన్‌బాబు, అల్లరి నరేశ్ కథానాయకులుగా 24 ఫ్రేమ్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రం ‘మామ మంచు - అల్లుడు కంచు’. మీనా, రమ్యకృష్ణ, పూర్ణ కథానాయికలు. కోటి, అచ్చు, రఘు కుంచె స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం పాటలను పార్లమెంట్ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి ఆవిష్కరించి, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాళ్ళ మాటల్లోనే...
నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేశాడు! - మోహన్‌బాబు
ఒక మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్ తీయాలని ఏడాదిన్నర పాటు నన్ను వెంటాడారు కో డెరైక్టర్ రవి. అలా ఈ సినిమా తెర మీదకు కొచ్చింది. రమ్యకృష్ణను హీరోయిన్‌గా తీసుకోవద్దని చాలామంది చెప్పారు. అప్పట్లో ఆ అమ్మాయి కారణంగా కలిసొచ్చి, ‘అల్లుడుగారు’ హిట్ అయ్యుండవచ్చు. మీనా డేట్స్ ‘అల్లరి మొగుడు’ టైంలో దొరకలేదు. దర్శకుడు క్రాంతికుమార్ గారు సంపాదించారు. వీరిద్దరూ నాకు బంగారం లాంటి వాళ్లు. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈవీవీ సత్యనారాయణ గారంటే నాకు చాలా అభిమానం. ఆయన వారసుడు నరేశ్ ఈ సినిమాలో నన్ను డామినేట్ చేయాలని చూశాడు. నేను కూడా అతనికి పోటీగా చేశా.
ఆయనతో సినిమా అంటే భయమేసింది - శ్రీనివాస రెడ్డి
మోహన్‌బాబు గారితో సినిమా అంటే భయమేసింది. కానీ సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ఇక ‘అల్లరి మొగుడు’ కాంబినేషన్‌ను ఈ సినిమాలో రిపీట్ చేశాం.
వాళ్ళను ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది - విష్ణు
నరేశ్ చేయాల్సిన పాత్ర నాదే. నేను చేస్తే నాన్నగారు చేయలేరు. అందుకే నరేశ్‌ని అడిగా. ఇది ‘అల్లరి మొగుడు’ పార్ట్-2లా ఉంటుంది. రమ్యకృష్ణ, మీనా గార్లను ఈ సినిమా కోసం ఒప్పించడానికి చాలా టైమ్ పట్టింది. నాన్నగారు హాయిగా సినిమాలో నటించడానికి కారణం అలీగారే.
మా కామెడీ రచ్చరంబోలా - అల్లరి నరేశ్
మోహన్‌బాబు గారిది, నాది - మా ఇద్దరి కామెడీ టైమింగ్ రచ్చ రంబోలా. ఇండస్ట్రీకి వచ్చాక ఐదు సినిమాలు చేస్తానా అనుకున్నా. 50 చేశా.
ఇలాంటి మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం! - అంబరీష్
లైఫ్‌లో డబ్బులు సంపాదించడం కష్టం కాకపోవచ్చేమో కానీ మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం. అలాంటి మిత్రుడే మోహన్‌బాబు.
‘అల్లుడు గారు’ లేకపోతే... - రమ్యకృష్ణ
నా ఫస్ట్ హిట్ ‘అల్లుడుగారు’. అది లేకపోతే ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదేమో. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.
ఈ సినిమా వద్దనుకున్నా! - మీనా
అసలు ఈ సినిమా వద్దనుకున్నా. నాకు పాప ఉందని చెప్పా. మోహన్‌బాబుగారు, విష్ణుగారు ఇచ్చిన భరోసాతో ఈ సినిమాలో చేశాను.
ఈ వేడుకలో సుబ్బరామిరెడ్డి, బ్రహ్మానందం, కోటి, సుమలత, బి. గోపాల్ తదిత రులు పాల్గొన్నారు.