'రెండేళ్లలో నా డెరైక్షన్‌లో మూవీ' | allari naresh special interview with sakshi | Sakshi
Sakshi News home page

'రెండేళ్లలో నా డెరైక్షన్‌లో మూవీ'

Published Sat, Jul 9 2016 10:59 AM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

'రెండేళ్లలో నా డెరైక్షన్‌లో మూవీ' - Sakshi

'రెండేళ్లలో నా డెరైక్షన్‌లో మూవీ'

  • రెండేళ్లలో నా డెరైక్షన్‌లో మూవీ
  • ఈవీవీ కాన్సెప్ట్ కామెడీతో సొంత బ్యానర్‌లో మూవీ
  • యూత్‌ఫుల్ కామెడీగా ‘సెల్ఫీ రాజా’
  • ‘సాక్షి’తో హీరో అల్లరి నరేష్
  • పెదవాల్తేరు : ‘‘నాన్న ఈవీవీ సత్యనారాయణ గారి కామెడీ ట్రెండ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తిలకించి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.  జంద్యాల శిష్యుడుగా నాన్నగారు తెరకెక్కించిన చిత్రాలన్నీ శత శాతం సక్సెస్‌ను సాధించాయి. ఆ కామెడీ చిత్రాలను చూస్తూ పెరగడం వల్లనేమో నేను కూడా తెరపై కామెడీని అవలీలగా పండిస్తున్నాననిపిస్తుంది. అమ్మ, నాన్న, అన్నా, చెల్లెలు ఇలా యావత్తు కుటుంబం చూసే విధంగానే కామెడీ సీన్‌లుండేలా చాలా జాగ్రత్త పడతాను. అంతేకాదు సందర్భోచితంగా వేసే సెటైర్లలో సైతం ఎక్కడా ద్వంద్వార్ధాలకు తావు లేకుండా జాగ్రత్తపడతాను. అందుకే నా చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటాను...’ అన్నారు వెండితెర ‘అల్లరి’ హీరో నరేష్. తన సినీ సంగతులను ‘సాక్షి’తో కాసేపు పంచుకున్నారు.
     
    ఈవీవీ బ్యానర్‌పై నాన్నగారి కామెడీ బ్రాండ్‌మూవీ

    ఈవీవీ బ్రాండ్ కామెడీ మూవీని మరలా ప్రేక్షకులకు అందించాలని సొంత బ్యానర్‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని పూర్తిగా పల్లె అందాల నడుమ సాగే కథాంశంతో తీయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కుటుంబంలో చేదు, తీపి సంఘటనల సమ్మేళనంగా సాగే సాఫీ జీవనాన్ని చక్కని ఆరోగ్యకరమైన కామెడీని జోడించి తీయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈవీవీ గారు గుర్తు రావాలన్నదే మా కాంక్ష.

    రెండేళ్ళలో నా డెరైక్షన్‌లో మూవీ

    మరో రెండేళ్ళలో నా డై రెక్షన్‌లో ఓ చిత్రాన్ని తీ యడానికి ఇప్పటి నుంచే కథను తయారు చేస్తున్నాం. నన్ను దర్శకుడుగా నాన్న చూడాలనుకున్నారు. అయితే యాదృచ్ఛికంగా హీరో అయ్యాను. దీంతో ఆయన కలను నెరవేరలేదు. ఇప్పుడు ఆయన కలను నెరవేర్చడానికి మెగా ఫోన్ పట్టుకునేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇప్పటికే సహాయ దర్శకుడిగా పని చేసిన అనుభవంతో దర్శకుడిగా అవతారమెత్తాలని నిర్ణయించుకున్నా. ఈ చిత్రాన్ని కూడా సొంత బ్యానర్‌లో తీస్తాం.
     
    నిర్మాణంలో రెండు మూవీలు

    సొంత బ్యానర్‌లో రెండు చిత్రాలను నిర్మిస్తున్నాం. వీటిలో ‘ఇంట్లో దెయ్యం- మాకేంటి భయం’ చిత్రం నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అలాగే కమెడియన్ కృష్ణ భగవాన్ కథ, స్క్రీన్‌ప్లేలో ‘మేడ మీద అబ్బాయి’ చిత్రం కూడా నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలను వినూత్న కథాంశాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధగా ఎక్కడా రాజీ లేకుండా నిర్మిస్తున్నాం. ఈ చిత్రాల నిర్మాణాన్ని అన్నయ్య రాజేష్ చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు 2017 వేసవిలో విడుదల చేస్తాం.

     నాన్నగారి పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు

    నాన్న పుట్టి పెరిగిన నిడదవోలు కేంద్రంగా ఈవీవీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్కడి గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాం. అంతేకాకుండా మాకు ఎంతో ఇష్టమైన మా సొంతవూరులో సేవ చేయడం ఎంతో భాగ్యంగా భావించి ఈ ప్రణాళికను తయారు చేస్తున్నాం. ఈ ట్రస్ట్ త్వరలోనే ఏర్పాటు చేస్తాం.
     
    యూత్‌ఫుల్ కామెడీ మూవీ సెల్ఫీరాజా

    ప్రస్తుతం యూత్ యావత్తూ సెల్ఫీల మాయలో ఉన్నారు. ఈట్రెండ్‌లో పడి సెల్ఫీ వ్యక్తిగత జీవితాల మీదుగా తెచ్చుకుంటున్నారు. సుమారు రెండువేలమంది సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇది యూత్‌కు తెలిసేట్టుగా ఫుల్‌యూత్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నా మార్కు కామెడీ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement