
సీబీఐ కార్యాలయానికి హీరో విష్ణు
హైదరాబాద్: హీరో మంచు విష్ణు సోమవారం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఓ కేసులో సీబీఐ అధికారుల ముందు సాక్షిగా ఆయన హాజరయ్యారు. గతంలో ఓ తెలుగు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీకి రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన సెన్సార్ బోర్డు అధికారి శ్రీనివాసరావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విష్ణును సీబీఐ సాక్షిగా పేర్కొంది.
శ్రీనివాసరావు కేసులో వివరాల సేకరణ కోసం సీబీఐ ఆదేశాల మేరకు విష్ణు ఇక్కడికి వచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు కొందరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని గతంలో మంచు విష్ణు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనను సాక్షిగా పిలిచినట్టు తెలుస్తోంది.