
ట్రాఫిక్‌లో రొమాన్స్!
ఎవరైనా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? చిరాకు పడటం కామన్. కానీ, మంచు విష్ణు, సురభి మాత్రం ట్రాఫిక్ జామ్‌లో.. తమ చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయి ఎంచక్కా ప్రేమించుకున్నారు. అయితే ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు లెండి. రీల్ లైఫ్‌లోనే. విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది.
నిర్మాత మాట్లాడుతూ– ‘‘చక్కని వాణిజ్య అంశాలున్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. తమన్ నేతృత్వంలో పాటల రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం‘ అన్నారు. సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, ఎల్.బి.శ్రీరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల.