మణిరత్నంతో మహేష్
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకశైలి ప్రత్యేకం అని చెప్పనక్కరలేదు. రోజా, మౌనరాగం, నాయకన్, దళపతి, ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఘనత మణిరత్నంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్ నుంచి నేటి యువతరం గౌతమ్‌కార్తీక్ వరకు విభిన్న చిత్రాలు చేసిన ఈ దర్శక శిఖామణి కడల్ చిత్రం తరువాత తదుపరి చిత్రానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే ఈసారి బాలీవుడ్‌లో చిత్రం చేయనున్నారని, మలయాళ చిత్రం చేయబోతున్నారని రకరకాల ప్రచారం జరిగింది. అరుుతే మణిరత్నం ఈ గ్యాప్ లో మూడు కథలను తయారు చేసుకున్నారట. వాటిలో ఒక కథనే లజ్జో. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించాలని భావించారని సమాచారం. ఇక రెండో కథను పాహద్ హీరోగా తమిళం, మలయాళం భాషల్లో రూపొందించాలని తలచారట.
అయితే ఇప్పుడు ఈ రెండింటినీ పక్క న పెట్టి మూడో కథను తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబుకు మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉంది. నిజానికి వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ అనే చిత్రం రూపొందాల్సింది. మహేష్‌బాబు కూడా త్వరలో తన కల నెరవేరబోతుందని పేర్కొన్నారు. కొన్ని కారణాల వలన ఆ చిత్రం తెరకెక్కలేదు. ప్రస్తుతం మహేష్‌బాబు టాలీవుడ్‌లో టాప్‌హీరోగా ప్రకాశిస్తున్నారు. తాజాగా మణిరత్నం తెరకెక్కించనున్న కథ పక్కా కమర్షియల్ అంశాలతో ఈ హీరోకు ఖచ్చితంగా నప్పే లా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని మహేష్‌బాబు వర్గం అంగీకరించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఇంకా నిర్ణయం కాలేదని వారంటున్నారు.