మళ్లీ మల్టీ స్టారర్‌ చిత్రం | Mani Ratnam Trying To Big Multistarrer With Vijay And Vikram | Sakshi
Sakshi News home page

మళ్లీ మల్టీ స్టారర్‌ చిత్రం

Published Mon, Dec 3 2018 1:17 PM | Last Updated on Mon, Dec 3 2018 1:17 PM

Mani Ratnam Trying To Big Multistarrer With Vijay And Vikram - Sakshi

సినిమా: దర్శకుడు మణిరత్నం అచ్చొచ్చిన బాటలోనే పయనించడానికి మొగ్గు చూపుతున్నారా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌ల్లో మల్టీస్టారర్‌ చిత్రాలు తెరకెక్కుతున్నా, కోలీవుడ్‌లో ఆ ట్రెండ్‌ తక్కువేనని చెప్పాలి. ఇటీవలే మణిరత్నం, శంకర్‌ ఆ తరహా చిత్రాలకు తెర లేపారు. సెక్క సివంద వానం చిత్రంలో అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్‌లను నటింపజేసి మణిరత్నం సక్సెస్‌ అయ్యారు. ఇక శంకర్‌ రజనీకాంత్, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అక్షయ్‌కుమార్‌లతో 2.ఓ చిత్రం చేశారు. నిజానికి కొంతకాలం క్రితమే విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబులతో పొన్నియన్‌ సెల్వమ్‌ అనే చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించే ప్రయత్నం చేసినా, అది అప్పుడు వర్కౌట్‌ కాలేదు.

ఇప్పుడు మళ్లీ అటకెక్కిన ఆ స్క్రిప్ట్‌ను దుమ్ముదులిపి వెండితెరపై ఆవిష్కరించడానికి మణిరత్నం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో ఈ సారి విజయ్, విక్రమ్, శింబులను నటింపజేయడానికి మణిరత్నం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వారు ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ఇది చారిత్రక కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుంది. అయితే ఈ క్రేజీ చిత్రం గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇకపోతే మణిరత్నంకు మల్టీస్టారర్‌ చిత్రాలు కలిసొచ్చాయనే చెప్పాలి. చాలా కాలం క్రితం రజనీకాంత్, మమ్ముట్టి, అరవిందస్వామిలతో రూపొందించిన దళపతి చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల సెక్క సివందవానంతో ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యింది. దీంతో మరోసారి మణిరత్నం అదే బాటలో పయనించి సక్సెస్‌ కొట్టాలనుకుంటున్నారన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement