నాన్నగారి పాటల్లా ఉన్నాయంటున్నారు!
‘‘నాకు చిన్నతనం నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. మా తాతగారు వైయన్ శర్మ ప్రముఖ సంగీత వాద్యకళాకారుడు. ఇక మా నాన్న గారు మణిశర్మ గురించి అందరికీ తెలుసు. అలా వారిద్దరి ప్రభావంతోనే నాలో సంగీతాభిలాష ఇంకా పెరిగింది’’ అన్నారు సాగర్ మహతి. ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ కుమారుడు సాగర్ మహతి ‘జాదూగాడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కీబోర్డ్ ప్లేయర్‌గా, ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్న నాకు ఈ సినిమాకు పనిచేసే అవకాశం దర్శకుడు యోగి గారి వల్లే వచ్చింది. నా తొలి సినిమా పాటలకు మంచి స్పందన వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
నా మీద కచ్చితంగా మా నాన్నగారి ప్రభావం 80 శాతం వరకూ ఉంది. మిగతా 20 శాతం సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ గారిదే. నేను ఆయన దగ్గర చాలా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాకు పనిచేస్తున్నపుడు నాన్నగారికి నా ట్యూన్స్ వినిపించేవాణ్ణి. ఆయనిచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. నా పాటలు విన్న ప్రతి ఒక్కరూ అచ్చం నాన్నగారి పాటల్లానే ఉన్నాయంటున్నారు. దాన్ని బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా. ప్రస్తుతం ఎస్.వి.కె బ్యానర్‌లో మధు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి స్వరాలందిస్తున్నా. మ్యూజిక్‌తో ఎంటర్‌టైన్ చేయడమే నా లక్ష్యం’’ అని చెప్పారు.