
విజయ్‌సేతుపతికి జతగా మంజిమా మోహన్
కేరళ కుట్టీలు కోలీవుడ్‌కు దిగుమతి అన్నది అప్రహతంగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం ప్రేమమ్ విజయం చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని నటించిన ముగ్గురు కథానాయికలకు తమిళ చిత్ర పరిశ్రమ రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానించింది. ఇక అలా దక్షిణాదిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న మరో మలయాళీ బ్యూటీ మంజిమామోహన్.
ఇప్పటికే శింబుకు జంట గా అచ్చంయంబ్బదు మడమయడా చిత్రంలో నటిస్తున్న ఈ భామ తెలుగులోనూ పాగా వేయనున్నారు. అక్కడ సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తమిళంలో వరుస విజయాలతో జోరు మీదున్న విజయ్‌సేతుపతి దృష్టిలో పడ్డారు. ఈయన కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో మంజిమామోహన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం.
విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసే మంచి అవకాశాన్ని మంజిమామోహన్ వదులు కుంటుందని ఎవరూ అనుకోరు. అనేగన్ చిత్రం తరువాత కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ఇది. అనేగన్ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థనే ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ప్రస్తుతం రెక్క చిత్రంలో నటిస్తున్న విజయ్‌సేతుపతి తదుపరి ఈ చిత్రానికి కాల్‌షీట్స్ ఇచ్చారని తెలిసింది. దీనికి హిప్ హాప్ తమిళా సంగీతాన్ని అందించనున్నారు. ఇక కేవీ.ఆనంద్ ఆస్థాన రచయితల ద్వయం శుభ కథ, కథనం, మాటలను అందిస్తున్నారు.