అద్భుతాలు ఒకరితో ఆవిష్కృతం కావు
‘‘సినిమా అంటే సమష్టి కృషి. విజయానికి ఉపయోగపడే సలహా ఎవరిచ్చినా తీసుకుంటాను. అద్భుతాలు ఒక్కరితో అవిష్కృతం కావని నమ్ముతాన్నేను. దర్శకుని పనిలో మనోజ్ వేలు పెడతాడు అంటారు. సినిమాపై సర్వహక్కులూ కథానాయకునికి ఉంటాయని నా అభిప్రాయం’’ అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు మనోజ్ కథానాయకునిగా మంచు విష్ణు నిర్మించిన ‘కరెంట్ తీగ’ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు నాగేశ్వరరెడ్డి. ‘‘కరెంట్‌తీగ లాంటి కుర్రాడి కథ ఇది. టైటిల్‌కి అతికినట్టు ఉండే పాత్రను మనోజ్ పోషించారు.
ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను కూడా తనే రూపొందించారు. ఎంతో రిస్కీ షాట్స్ చేశారాయన. రేపు ఆ సాహసాలను తెరపై చూస్తారు. ఇంటిల్లిపాదీ చూసి ఆనందించే సంపూర్ణ వినోదాత్మక చిత్రమిది. ఇప్పటివరకూ వచ్చిన మనోజ్ చిత్రాలన్నీ వినోదాత్మకంగానే సాగాయి. ఈ సినిమా వాటికి ఓ మెట్టు పైనే ఉంటుంది’’ అని చెప్పారు. ఇతర పాత్రల గురించి మాట్లాడుతూ-‘‘ఇందులో జగపతిబాబుది కీలక పాత్ర. ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకుంటాయి. రకుల్ ప్రీత్‌సింగ్ ఇందులో మరింత అందంగా కనిపిస్తారు. సన్నీ లియోన్‌ని ఇందులో చీరకట్టులో కొత్తగా కనిపిస్తారు. ఇటీవలే ఈ చిత్రాన్ని మోహన్‌బాబుగారు చూసి అభినందించారు.
ఆయనే మా సినిమాకు తొలి ప్రేక్షకుడు కూడా’’ అని తెలిపారు. మరికొన్ని విషయాలు నాగేశ్వరరెడ్డి చెబుతూ- ‘‘నా సినిమాలన్నీ వినోద ప్రధానంగా సాగేవే. టికెట్ తీసుకొని థియేటర్లోకి అడుగుపెట్టే ప్రేక్షకుడు మనసారా నవ్వుకొని వెళ్లాలని కోరుకుంటాన్నేను. అందుకు తగ్గట్టే సినిమాలు తీశాను కూడా. పెద్ద హీరోలతో సినిమా చేయరేంటి? అని చాలామంది అడుగుతుంటారు. నిజానికి పెద్ద హీరోతో చేసే అవకాశం నాకు ఎప్పుడో వచ్చింది. కానీ... కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే... త్వరలోనే ఓ అగ్ర హీరోతో సినిమా చేస్తా’’అని చెప్పారు.