వేలానికి మార్లిన్ మన్రో ఎక్సరేలు
వేలానికి మార్లిన్ మన్రో ఎక్సరేలు
Published Fri, Oct 11 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
ఒక తరాన్ని ఉర్రూతలూగించిన హాలీవుడ్ హాట్ గాళ్ మార్లిన్ మన్రో చనిపోయి దాదాపు 50 ఏళ్లవుతున్నా చాలామంది హార్ట్స్‌లో ఆమె నిలిచిపోయారు. అతి చిన్న వయసు (36)లోనే చనిపోయిన ఈ అందాల తార గురించి ఇప్పటికీ హాలీవుడ్‌లో ఏదో ఒక టాపిక్ వినిపిస్తుంటుంది. అలాగే ఈ సౌందర్య రాశి వాడిన వస్తువులను, ప్రత్యేకమైన ఫొటోలను అడపా దడపా వేలం వేసిన సందర్భాలూ ఉన్నాయి. మన్రో అభిమానులు వీటిని చేజిక్కించుకోవడానికి వేలం పాటలో చాలా జోరుగా పాల్గొంటుంటారు.
వచ్చే నెల 9, 10 తేదీల్లో మరో వేలం పాట జరగనుంది. 1950 నుంచి 1962 వరకు మన్రో వైద్యానికి సంబంధించిన ఎక్స్‌రేలు, ఆమె కాస్మటిక్ సర్జరీ చేయించుకున్న రికార్డ్స్‌ను వేలం వేయనున్నారు. అప్పట్లో డా.గుర్డిన్ దగ్గర ముక్కు, బుగ్గల అందం రెట్టింపు కావడం కోసం ఆమె కాస్మటిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇతర శారీరక సమస్యలకు సంబంధించి ఆమె తీయించుకున్న ఆరేడు ఎక్స్‌రేలతో పాటు ఈ రిపోర్ట్స్‌ను ఓ వ్యక్తికి బహుమతిగా ఇచ్చారట గుర్డిన్.
వాటిని సదరు వ్యక్తి జూలియన్స్ ఆక్షన్స్‌కి అమ్మాడు. వాటినే వేలానికి పెట్టబోతున్నారు. 15 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్ల వరకు ఇవి అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. దాదాపు మూడేళ్ల క్రితం మన్రో మూడు చెస్ట్ ఎక్స్‌రేలను వేలానికి పెడితే, 45 వేల డాలర్లకు అమ్ముడు పోయాయట.
ఓ వైపు ఈ వేలం పాటలో పాల్గొనడానికి ఇప్పట్నుంచే చాలామంది రెడీ అయిపోతుంటే, కొంతమంది మాత్రం ‘మార్లిన్‌ది సహజ సౌందర్యం అనుకున్నాం. కాస్మటిక్ సర్జరీ చేయించుకుందా’ అని చర్చించుకుంటున్నారు. అయితే మన్రో వీరాభిమానులు మాత్రం... ‘మన్రో అద్భుత సౌందర్య రాశి. ఆ సౌందర్యానికి మెరుగులు దిద్దించుకుని ఉంటుంది’ అంటున్నారు. ఏదేమైనా... వచ్చే నెల జరగబోతున్న వేలం పాటకు మాత్రం మంచి డిమాండ్ ఉంటుందని ఊహించవచ్చు.
Advertisement
Advertisement