x-rays
-
ఎక్స్ కిరణాలను కనుగొన్న రాంట్జన్
ఆ నేడు 1895 నవంబర్ 8. ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్ధారణకు ఎంతగానో తోడ్పడుతున్న ఎక్స్ కిరణాలను జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త విలియం రాంట్జెన్ కనుగొన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీతో సహా పలు విఖ్యాత విశ్వవిద్యాలయాలలో భౌతికశాస్త్ర అధ్యాపకునిగా, ఆచార్యునిగా పని చేసిన రాంట్జెన్ నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉండేవారు. తన పరిశోధనలలో భాగంగా ఓ రోజున యాదృచ్ఛికంగా జరిగిన ఓ చర్య వల్ల ఈ కిరణాలను ఆయన కనుగొన్నారు. మొదట్లో వాటిని అందరూ రాంట్జెన్ కిరణాలనే అనేవారు కానీ రాంట్‌జెనే స్వయంగా వాటికి ఎక్స్ కిరణాలని పేరు పెట్టడంతో అందరూ దానిని ఆమోదించక తప్పలేదు. ఈ మహావిష్కరణకి గుర్తుగా ఆయనకు 1901లో భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. బహుమతిగా వచ్చిన మొత్తాన్ని కూడా ఆయన తాను పని చేస్తున్న విశ్వవిద్యాలయానికే విరాళంగా ఇచ్చి, తన ఉదారతను చాటుకున్నారు. ఆయన పేరును చిరస్మరణీయం చేసేందుకుగానూ 2004లో కనుగొన్న 111వ మూలకానికి ఐయూపీఏసీ రాంట్జెనీయం అని పేరు పెట్టింది. -
సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!
ఇప్పటిదాకా తీసిన సూర్యుడి ఫొటోల్లో అన్నింటి కన్నా ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫొటో అట. సూర్యుడి ఉపరితలం నుంచి అతి శక్తిమంతమైన ఎక్స్ కిరణాలు(నీలి రంగులో ఉన్నవి) వెలువడుతున్నప్పుడు ఇటీవల అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘నూస్టార్’ టెలిస్కోపు ఈ ఫొటోను క్లిక్‌మనిపించింది. వాస్తవానికి సుదూర ప్రాంతాల్లోని నక్షత్రాలు, కృష్ణబిలాలను అధ్యయనం చేసేందుకు నూస్టార్(న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే)ను నాసా 2012లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. అయితే, దీనితో పరిశోధన చేపట్టిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తొలిసారిగా ఇలా సూర్యుడి వైపు తిప్పారు. ఇంకేం.. ఇంతకుముందెన్నడూ వీలుకానంత స్పష్టమైన ఫొటోలో సూర్యుడు చిక్కాడు. ఈ టెలిస్కోపుతో అధ్యయనం వల్ల సూర్యుడి ఉపరితలం, సౌరజ్వాలలు, రేడియేషన్, ప్లాస్మాకణాల గురించి కొత్త సంగతులు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కసారి ఇది సౌరజ్వాలను సరైన సమయంలో ఫొటో తీస్తే గనక.. దశాబ్దాల చిక్కుముడి సైతం వీడిపోవచ్చని భావిస్తున్నారు. -
వేలానికి మార్లిన్ మన్రో ఎక్సరేలు
ఒక తరాన్ని ఉర్రూతలూగించిన హాలీవుడ్ హాట్ గాళ్ మార్లిన్ మన్రో చనిపోయి దాదాపు 50 ఏళ్లవుతున్నా చాలామంది హార్ట్స్‌లో ఆమె నిలిచిపోయారు. అతి చిన్న వయసు (36)లోనే చనిపోయిన ఈ అందాల తార గురించి ఇప్పటికీ హాలీవుడ్లో ఏదో ఒక టాపిక్ వినిపిస్తుంటుంది. అలాగే ఈ సౌందర్య రాశి వాడిన వస్తువులను, ప్రత్యేకమైన ఫొటోలను అడపా దడపా వేలం వేసిన సందర్భాలూ ఉన్నాయి. మన్రో అభిమానులు వీటిని చేజిక్కించుకోవడానికి వేలం పాటలో చాలా జోరుగా పాల్గొంటుంటారు. వచ్చే నెల 9, 10 తేదీల్లో మరో వేలం పాట జరగనుంది. 1950 నుంచి 1962 వరకు మన్రో వైద్యానికి సంబంధించిన ఎక్స్‌రేలు, ఆమె కాస్మటిక్ సర్జరీ చేయించుకున్న రికార్డ్స్‌ను వేలం వేయనున్నారు. అప్పట్లో డా.గుర్డిన్ దగ్గర ముక్కు, బుగ్గల అందం రెట్టింపు కావడం కోసం ఆమె కాస్మటిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇతర శారీరక సమస్యలకు సంబంధించి ఆమె తీయించుకున్న ఆరేడు ఎక్స్‌రేలతో పాటు ఈ రిపోర్ట్స్‌ను ఓ వ్యక్తికి బహుమతిగా ఇచ్చారట గుర్డిన్. వాటిని సదరు వ్యక్తి జూలియన్స్ ఆక్షన్స్కి అమ్మాడు. వాటినే వేలానికి పెట్టబోతున్నారు. 15 వేల డాలర్ల నుంచి 30 వేల డాలర్ల వరకు ఇవి అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. దాదాపు మూడేళ్ల క్రితం మన్రో మూడు చెస్ట్ ఎక్స్‌రేలను వేలానికి పెడితే, 45 వేల డాలర్లకు అమ్ముడు పోయాయట. ఓ వైపు ఈ వేలం పాటలో పాల్గొనడానికి ఇప్పట్నుంచే చాలామంది రెడీ అయిపోతుంటే, కొంతమంది మాత్రం ‘మార్లిన్‌ది సహజ సౌందర్యం అనుకున్నాం. కాస్మటిక్ సర్జరీ చేయించుకుందా’ అని చర్చించుకుంటున్నారు. అయితే మన్రో వీరాభిమానులు మాత్రం... ‘మన్రో అద్భుత సౌందర్య రాశి. ఆ సౌందర్యానికి మెరుగులు దిద్దించుకుని ఉంటుంది’ అంటున్నారు. ఏదేమైనా... వచ్చే నెల జరగబోతున్న వేలం పాటకు మాత్రం మంచి డిమాండ్ ఉంటుందని ఊహించవచ్చు.