సూర్యుడి ఫొటోల్లో ఇదే టాప్!
ఇప్పటిదాకా తీసిన సూర్యుడి ఫొటోల్లో అన్నింటి కన్నా ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఫొటో అట. సూర్యుడి ఉపరితలం నుంచి అతి శక్తిమంతమైన ఎక్స్ కిరణాలు(నీలి రంగులో ఉన్నవి) వెలువడుతున్నప్పుడు ఇటీవల అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘నూస్టార్’ టెలిస్కోపు ఈ ఫొటోను క్లిక్‌మనిపించింది. వాస్తవానికి సుదూర ప్రాంతాల్లోని నక్షత్రాలు, కృష్ణబిలాలను అధ్యయనం చేసేందుకు నూస్టార్(న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే)ను నాసా 2012లో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.
అయితే, దీనితో పరిశోధన చేపట్టిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తొలిసారిగా ఇలా సూర్యుడి వైపు తిప్పారు. ఇంకేం.. ఇంతకుముందెన్నడూ వీలుకానంత స్పష్టమైన ఫొటోలో సూర్యుడు చిక్కాడు. ఈ టెలిస్కోపుతో అధ్యయనం వల్ల సూర్యుడి ఉపరితలం, సౌరజ్వాలలు, రేడియేషన్, ప్లాస్మాకణాల గురించి కొత్త సంగతులు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కసారి ఇది సౌరజ్వాలను సరైన సమయంలో ఫొటో తీస్తే గనక.. దశాబ్దాల చిక్కుముడి సైతం వీడిపోవచ్చని భావిస్తున్నారు.