
వరంగల్‌లో ఎంసీఏ చదువుతున్నాడు!
యస్... యువ హీరో నాని ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నారు. అదీ వరంగల్‌లో! ఊరుకోండి... హిట్లు మీద హిట్లు, హీరోగా మంచి స్థాయిలో ఉన్న నానీకి చదువుకోవలసిన అవసరం ఏముంది? అనుకుంటున్నారా! ఇప్పుడు... స్టూడెంట్స్ అయితే డిగ్రీ వరకో, పీజీ వరకో చదువుతారు. అదే... హీరోలు అయితే ప్రతి ఏడాది చదువుకోవాలి.
ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తే... అన్నిసార్లు చదువుకోవాలి. ఏం చదువుకోవాలంటే... సిన్మా స్క్రిప్టులు! ఇప్పుడు నాని చదువుతున్నదీ స్క్రిప్టే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఎంసీఏ’. మిడిల్ క్లాస్ అబ్బాయి... అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వరంగల్‌లో జరుగుతోంది. మంగళవారం మొదలైన ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు జరుగుతుందట. నానితో పాటు హీరోయిన్ సాయి పల్లవి, ఇతర కీలక పాత్రధారులు చిత్రీకరణలో పాల్గొననున్నారు. హిందీ ‘పింక్’ ఫేమ్ విజయ్‌వర్మ ఇందులో ముఖ్య పాత్ర చేస్తున్నారు.