‘‘హిందీ పరిశ్రమలో బంధుప్రీతి బాగా ఎక్కువ. వారసులకు ఇచ్చిన ప్రాధాన్యం బయటి నుంచి వచ్చినవారికి ఇవ్వరు’’ అని కథానాయిక కంగనా రనౌత్ విమర్శనాస్త్రాలు విసురుతుంటారు. ఇప్పుడు తమిళ పరిశ్రమలో ‘నెపోటిజమ్’ (బంధుప్రీతి) వివాదం మొదలైంది. ‘‘ఇక్కడ వారసులదే హవా. ప్రతిభను పట్టించుకోరు. బిగ్ డాడీ (కమల్‌ని ఉద్దేశించి మీరా ఇలా అంటారట)కి, చిత్రపరిశ్రమలోని పెద్దలకు వారసులు చాలు. పైగా ఎవరైనా (బయటనుంచి వచ్చిన ఆర్టిస్టులు) పాపులర్ అవుతుంటే భరించలేరు. వాళ్లు యాక్ట్ చేసిన సీన్స్‌ని కత్తిరించేస్తారు. సినిమాలు చేజారేలా చేస్తారు’’ అని తమిళ నటి మీరా మిథున్ సోషల్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు.
మోడల్‌గా కెరీర్ ఆరంభించి, ‘8 తోటాక్కళ్’ (2017)తో సినిమా కెరీర్ మొదలుపెట్టారామె. ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించిన మీరా ప్రస్తుతం కమల్‌హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ ‘బిగ్ బాస్ 3’లో పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చేశారు కూడా. ‘బిగ్ బాస్ 3’ మీరాకి కావాల్సినంత క్రేజ్‌ని తెచ్చింది. ఈ క్రేజ్‌తో తమిళంలో చాలా అవకాశాలు వస్తాయని కూడా ఊహించారామె. దానికి తగ్గట్టే మీరాకి అవకాశాలు వస్తున్నాయి. అయితే ‘అగ్ని శిరగుగళ్’ అనే íసినిమాలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత ఆ సినిమాలో అక్షరాహాసన్‌ని కథానాయికగా తీసుకున్నారు. ‘‘కోలీవుడ్‌లో నెపోజిటమ్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు బాగా స్పష్టం అయిపోయింది.
ఈ సినిమా నుంచి నన్ను తప్పించడానికి కమల్‌హాసన్ కారణం అయ్యుంటారు. ఎందుకంటే ఆయన సొంత కూతురు అక్షరాహాసన్‌ని తీసుకున్నారు. అక్షరాకి కొంచెం కూడా గిల్టీ అనిపించడంలేదా? నవీన్ (చిత్రదర్శకుడు), టి. శివమ్మా (నిర్మాత).. మీ ఇద్దరి ద్వంద్వ వైఖరి నాకు అర్థమైంది’’ అని మీరా మిథున్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. అందుకు బదులుగా ‘‘మీరా మిథున్‌ని ఈ చిత్రంలో నటింపజేయాలని అనుకోలేదు. మాతో మాట కూడా చెప్పకుండా తనంతట తనే ఈ సినిమా చేస్తున్నట్లు మీడియాకి చెప్పింది. కానీ నేను వివాదం చేయదలచుకోలేదు. అందుకని మాట్లాడలేదు. మేం ముందు షాలినీ పాండేని అనుకున్నాం.
ఇప్పుడు తన స్థానంలో అక్షరాహాసన్‌ని తీసుకున్నాం’’ అని ట్వీటర్ ద్వారా నవీన్ పేర్కొన్నారు. అయితే మీరా మిథున్ జిమ్నాస్ట్ కాబట్టి, ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తనని తీసుకోవాలనుకుంటున్నాం అని నవీన్ చెప్పిన ఇంటర్వ్యూని బయటపెట్టారు మీరా. ‘‘ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి మీకు గుర్తుందా? లేక ప్రెస్ కూడా అబద్ధం ఆడిందంటారా? ఏంజెలినా జోలీ (హాలీవుడ్ నటి) లాంటి నటి కావాలని నన్ను తీసుకుంటున్నట్లు మీరు చెప్పిన విషయం మరచిపోయారా? మీకు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందేమో! అందుకే నేను గుర్తు చేస్తున్నాను’’ అంటూ మీరా ఘాటుగా స్పందించారు.
అంతేకాదు.. ఓ పురుషుడివి అయ్యుండి నిజం చెప్పడానికి గట్స్ లేవా అంటూ ఓ ఇంటర్వ్యూలో నవీన్‌ని ఉద్దేశించి అన్నారు మీరా. అందుకు నవీన్ స్పందిస్తూ – ‘‘మగవాడిగా పుట్టినందుకు గర్వపడే వ్యక్తిని కాదు నేను. స్త్రీలు అయినప్పటికీ మా అమ్మ, సోదరి, నా భార్య నాకన్నా గట్స్ ఉన్నవాళ్లు. మీకేదో సమస్య ఉందనుకుంటా మీరా.. డాక్టర్‌ని సంప్రదించండి. మీ ‘సిల్లీ ట్వీట్స్’కి ఇదే నా చివరి సమాధానం. శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘మాటలు జాగ్రత్త. ఒక స్త్రీని డాక్టర్‌ని కలవమని చెప్పే అధికారం మీకెవరు ఇచ్చారు? ‘అగ్ని శిరగుగళ్’ సినిమా గురించి, నా పాత్ర గురించి మనం మాట్లాడినట్లు నిర్ధారించడానికి నా దగ్గర ఆడియో ఉంది.
అది కనుక నేను బయటపెడితే మీకొక్కరికే కాదు మీ కుటుంబంలో ఉన్న స్త్రీల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. మరి.. నేను బయటపెట్టనా? ఎదుర్కొనే గట్స్ మీకున్నాయా?’’ అని ట్వీట్ చేశారు మీరా. అందుకు నవీన్ నుంచి సమాధానం రాకపోవడంతో ‘‘ఏమైంది నవీన్ కుమార్. ఎందుకు సైలెంట్ అయిపోయారు. సవాల్‌ని ఎదుర్కోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు మీరా.ఇలా వాడివేడి ట్వీట్స్‌తో మీరా మిథున్ టాక్ ఆఫ్ కోలీవుడ్ అయ్యారు. అయితే ఈ వివాదం గురించి మంగళవారం సాయంత్రం వరకూ కమల్, అక్షరా నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి.. స్పందిస్తారో? సైలెంట్‌గా ఉండిపోతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment