
'పవర్ స్టార్ అని అరవండయ్యా.. కమాన్'
'మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్.. కంటిన్యూ.. చాలా రోజులైపోయింది ఇలాగ విని .. గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని అరవండయ్యా.. కమాన్' అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ను ఫిదా చేశాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన 'తిక్క' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ధరమ్ తేజ్.. మామ పవన్ మీదున్న అభిమానాన్ని ఉత్సాహంగా ప్రదర్శించి ఫ్యాన్స్ను ఖుషీ చేశాడు. మెగా హీరోలకు సంబంధించిన సినీ వేడుకలన్నిటిలో పవన్ ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ హాలును హోరెత్తించడం పవన్ ఫ్యాన్స్కి అలవాటే.
ఇటీవలే 'సరైనోడు' సినిమాకి సంబంధించిన ఓ వేడుకలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పవన్ ఫ్యాన్స్పై కాస్త అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ అని చెప్పమంటూ పవన్ ఫ్యాన్స్ అరిచిన అరుపులకు.. 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ చిరు కోపాన్ని ప్రదర్శించాడు. దాంతో 'చెప్పను బ్రదర్' అనే ట్యాగ్తో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఇక ఆ తర్వాత బన్నీ తగిన వివరణ కూడా ఇచ్చుకోవలసి వచ్చింది.
అయితే ఇప్పుడు ధరమ్ తేజ్ కొత్త సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా పవన్ ఫ్యాన్స్ చేసే హడావుడిని 'ఆపలేను బ్రదర్' అంటూ ఫ్యాన్స్ను ఉత్తేజపరచడం, వారితో కలిసి పవర్ స్టార్ అంటూ బిగ్గరగా నినాదాలు చేయడం పవన్ కల్యాణ్ అభిమానులను మహదానందపరిచింది. మీరు ఎన్నిసార్లు అరవమన్నా అరుస్తూనే ఉంటాను.. పవర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్.. అంటూ ఈ యువ హీరో అభిమానుల మనసు దోచుకున్నాడు. ధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ 'ఆపలేను బ్రదర్' ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బన్నీ 'చెప్పను బ్రదర్'కి సరైన కౌంటర్ పడిందంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కాగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'తిక్క' సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.