అది ఇంకా కలగానే ఉంది అంటోంది నటి మేఘాఆకాశ్. ఒరు పక్క కథై చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ చల్ మోహనరంగా, లై వంటి రెండు చిత్రాలు చేసినా అవి ఆశించిన విజయాలను సాధించలేదు. అదేవిధంగా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో అవకాశాన్ని అందుకుంది. అక్కడ శాటిలైట్ శంకర్ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకుంది. కోలీవుడ్‌లో జీవితంలో గుర్తుండిపోయే అవకాశాన్ని అందుకుంది. అదే సూపర్‌స్టార్‌తో పేట చిత్రంలో నటించడం. ప్రస్తుతం అధర్వతో రోమాన్స్ చేసిన బూమరాంగ్ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా మేఘాఆకాశ్‌తో చిన్న భేటీ..
ప్ర: సినీ రంగప్రవేశం గురించి?
జ: చిన్న వయసు నుంచే సినిమారంగం అంటే చాలా ఇష్టం. అందుకే నటి కావాలని ఆశపడ్డాను. కళాశాలలో చదువుతున్నప్పుడు దర్శకుడు బాలాజీధరణీధరన్ ఒరు పక్క కథై చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా, చదువును పూర్తి చేద్దామా? అన్న సందిగ్ధ పరిస్థితిలో ఉన్నా, చివరికి నటనకే మొగ్గు చూపాను. ఆ చిత్రంలో నటించడం నచ్చడంతో నటిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను.
ప్ర: పేట చిత్రంలో నటించే అవకాశం వరించడం గురించి?
జ: రజనీకాంత్‌తో నటించాలన్నది ప్రతి ఒక్క నటి కల. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిననే భావిస్తున్నాను. పేట చిత్రం అలా కుదిరింది. తొలి రోజుల్లోనే రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం రావడం సాధారణ విషయం కాదు. ఆ చిత్రం తరువాత శింబుతో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం తెరపైకి వచ్చింది. త్వరలో ధనుష్‌తో జతకట్టిన ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా, అధర్వకు జంటగా నటించిన బూమరాంగ్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. పేట చిత్రం నాకు చాలా లక్కీ. ఇప్పటికీ రజనీకాంత్‌తో కలిసి నటించానన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా. అది ఇంకా కలగానే ఉంది.
ప్ర: శింబు సరసన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో నటించిన అనుభవం గురించి?
జ: తెలుగులో నేను నటించిన చిత్రాలు చూసి దర్శకుడు సుందర్.సీ ఈ నటే నా చిత్రంలో మాయ పాత్రకు బాగుంటుందని నిర్ణయించుకున్నారట. ఆయన దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు నేను చూశాను. సుందర్.సీ చిత్రాలు చాలా జాలీగా, ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా ఉంటాయి. అదే విధంగా వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో మాయ పాత్ర లభించింది. ఇక శింబు పాత్ర కూడా చాలా వరకు జాలీగా ఉండటంతో షూటింగ్ సెట్‌లో అంతా సందడి వాతావరణమే. ఆ చిత్ర టీమ్‌తో కలిసి పని చేయడం కొత్త అనుభవం.
ప్ర: బూమరాంగ్ చిత్రం గురించి?
జ: నేను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల కంటే భిన్నమైన చిత్రం బూమరాంగ్. ఈ చిత్రంలో నా పాత్ర పేరు జీజీ. విజువల్ కమ్యునికేషన్ విద్యార్థినిగా నటించాను. చిత్రంలో ప్రేమ ఉంటుంది. అదే సమయంలో సమాజానికి అవసరమైన సందేశం ఉంటుంది. ఒక పక్క వినోదంగా ఉంటూనే మరో పక్క చాలా సీరియస్‌గా సాగుతుంది. అలా పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కూడిన కమర్షియల్ కథాంశంతో కూడిన చిత్రం. ఇందులో నటించడం నాకు సరికొత్త అనుభవం. అధర్వ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాత్ర కోసం కఠినంగా శ్రమిస్తారు. ఆధర్వ, నటుడు సతీశ్ కలిస్తే ఆట పట్టించడం, జోకులు అంటూ సరదాల సందడే. వారు నన్నూ ఆట పట్టించారు.
ప్ర: సరే ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు?
జ: నిజం చెప్పాలంటే నాకు కథతో పయనించే పాత్రలు లభిస్తే చాలు. ఫలాన పాత్రల్లో నటించాలన్న కోరికలు నాకు లేవు. వైవిధ్యభరిత పాత్రలు, సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment