
తమిళ సినిమా: తమిళసినిమా పరిధి పెరిగి చాలా కాలమే అయ్యింది. అయితే విదేశాల్లో మన స్టార్స్ నటించిన చిత్రాలే అధికంగా విడుదలవుతాయి. అలాంటి చిత్రాలకే అక్కడ ఆదరణ ఉంటుంది. అలాంటిది ఒక చిన్న తమిళ చిత్రం ఫ్రాన్స్ దేశంలో 30 థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషమే అవుతుంది. ఆ చిత్రమే మేల్‌నాట్టు మరుమగన్. రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆండ్రియన్ అనే ఆంగ్ల బ్యూటీ కథానాయకిగా నటించడం విశేషం. వీఎస్.రాఘవన్, అంజలీదేవి, అశోక్‌రావు, సాతన్య ముఖ్య పాత్రలను పోషించారు.
ఉదయ క్రియేషన్స్ పతాకంపై మనో ఉదయకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్‌ఎస్ నిర్వహించారు. చిత్రం గురించి ఈయన తెలుపుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు నచ్చడంతో ఫ్రాన్స్‌కు చెందిన ఒక యువతి ఇక్కడి యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మేల్‌నాట్టు మరుమగన్ చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు. చిత్రంలో ప్రేక్షకులను అలరించే పలు అంశాలు ఉంటాయని చెప్పారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పలుమార్లు ప్రయత్నించినా, ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. ఈ రోజుల్లో చిన్న చిత్రాల విడుదల ఎంత కష్టంగా మారిందో తెలియంది కాదన్నారు. తమ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన అంశం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఫ్రాన్స్ దేశంలోనూ 30 థియేటర్లలో విడుదల చేయనున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment