విజయ్ తాజా సినిమా ’మెర్సల్’ బాక్సాఫీస్‌ను నిజంగానే షేక్ చేస్తోందా? ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి.. రజనీకాంత్ ’రోబో’ (యంతిరన్) తర్వాత ఈ ఘనత సొంతం చేసుకున్న రెండో తమిళ సినిమాగా చరిత్ర సృష్టించిందని కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా చుట్టు రాజకీయ వివాదాలు ముసురుకోగా.. తాజాగా ఈ సినిమా వసూళ్లపై వివాదం ముసురుకుంది. ’మెర్సల్’ కలెక్షన్ రికార్డులు ఉత్త ఫేక్ అని ప్రముఖ పంపిణీదారుడు అబిరా రామనాథం కొట్టిపారేశారు. చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్ మాల్ ఓనర్ అయిన ఆయన తాజాగా ’వుయ్‌టాకీస్’ తమిళ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ’మెర్సల్’ వసూళ్ల లెక్కలు ఉత్త బూటకమని, ఈ సినిమా ఇంత భారీగా వసూళ్లు సాధించింది అనడానికి ప్రామాణికత ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఈ కల్పిత ప్రచారాన్ని సృష్టించారని, అయినా సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యూహాన్ని చాలాకాలంగా పాటిస్తున్నారని ఆయన చెప్పారు.
’నేను 1976 నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను. టికెట్లను బ్లాక్‌లో అమ్మేందుకు అప్పట్లో మేమే ప్రజలను నియమించేవాళ్లం. టికెట్ ధరను పెంచి బ్లాక్‌లో అమ్ముతున్నారని తెలిసి ప్రజలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపేవారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. తమ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసిందని ప్రకటిస్తే.. సహజంగానే ఆ సినిమాలో ఏముందో చూడాలన్న ఉత్సుకత ప్రజల్లో ఏర్పడుతుంది. అంత భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసిన సినిమాను మిస్ కావొద్దని ప్రజలు కోరుకుంటారు. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా చెప్తున్న.. నిజానికి ఒక సినిమా థియెట్రికల్ రన్ ముగిసే వరకు ఎంత వసూళ్లు వచ్చాయో నిర్మాతకు తెలియదు’ అని ఆయన వివరించారు. అట్లీ దర్శకత్వంతో విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ’మెర్సల్’ సినిమా ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ’మెర్సల్’ కలెక్షన్లు ఫేక్ అంటూ వ్యాఖ్యలు చేసిన డిస్ట్రిబ్యూటర్ అబిరా రామనాథంపై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment