box-office collection
-
షాకింగ్: ఆ సినిమా కలెక్షన్లు ఫేక్ అట!
విజయ్ తాజా సినిమా ’మెర్సల్’ బాక్సాఫీస్‌ను నిజంగానే షేక్ చేస్తోందా? ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి.. రజనీకాంత్ ’రోబో’ (యంతిరన్) తర్వాత ఈ ఘనత సొంతం చేసుకున్న రెండో తమిళ సినిమాగా చరిత్ర సృష్టించిందని కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా చుట్టు రాజకీయ వివాదాలు ముసురుకోగా.. తాజాగా ఈ సినిమా వసూళ్లపై వివాదం ముసురుకుంది. ’మెర్సల్’ కలెక్షన్ రికార్డులు ఉత్త ఫేక్ అని ప్రముఖ పంపిణీదారుడు అబిరా రామనాథం కొట్టిపారేశారు. చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్ మాల్ ఓనర్ అయిన ఆయన తాజాగా ’వుయ్టాకీస్’ తమిళ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ’మెర్సల్’ వసూళ్ల లెక్కలు ఉత్త బూటకమని, ఈ సినిమా ఇంత భారీగా వసూళ్లు సాధించింది అనడానికి ప్రామాణికత ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఈ కల్పిత ప్రచారాన్ని సృష్టించారని, అయినా సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యూహాన్ని చాలాకాలంగా పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ’నేను 1976 నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను. టికెట్లను బ్లాక్‌లో అమ్మేందుకు అప్పట్లో మేమే ప్రజలను నియమించేవాళ్లం. టికెట్ ధరను పెంచి బ్లాక్‌లో అమ్ముతున్నారని తెలిసి ప్రజలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపేవారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. తమ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసిందని ప్రకటిస్తే.. సహజంగానే ఆ సినిమాలో ఏముందో చూడాలన్న ఉత్సుకత ప్రజల్లో ఏర్పడుతుంది. అంత భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసిన సినిమాను మిస్ కావొద్దని ప్రజలు కోరుకుంటారు. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా చెప్తున్న.. నిజానికి ఒక సినిమా థియెట్రికల్ రన్ ముగిసే వరకు ఎంత వసూళ్లు వచ్చాయో నిర్మాతకు తెలియదు’ అని ఆయన వివరించారు. అట్లీ దర్శకత్వంతో విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ’మెర్సల్’ సినిమా ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ’మెర్సల్’ కలెక్షన్లు ఫేక్ అంటూ వ్యాఖ్యలు చేసిన డిస్ట్రిబ్యూటర్ అబిరా రామనాథంపై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. -
వారెవ్వా 'మెర్సల్'.. కళ్లు చెదిరే వసూళ్లు!
విజయ్ తాజా సినిమా 'మెర్సల్'.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. బీజేపీ వాళ్లు ఎంత గగ్గోలు రేపినా.. ఈ సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు సరికదా.. ఈ వివాదాలు 'మెర్సల్' వరంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో విడుదలైన 'మెర్సల్' సినిమా తొలిరోజు ఏకంగా రూ. 43.50 కోట్లు వసూలు చేసి.. ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. దీపావళి కానుకగా విడుదలైన 'మెర్సల్' తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా అక్షరాల రూ. 170 కోట్లు వసూలు చేసిందని సమాచారం. వైద్య మాఫియాపై అస్త్రంగా తెరకెక్కిన 'మెర్సల్' సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియా పథకాలపై విమర్శలు ఉండటం బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఆ డైలాగులు తొలగించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదం మీడియాలో పతాకశీర్షికలకు ఎక్కడం, పలువురు సినీ ప్రముఖులు, జాతీయ నాయకులు సినిమాకు అండగా నిలబడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలో ఏముందో చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఒక్క తమిళ వెర్షన్లోనే విడుదలైన 'మెర్సల్' ప్రపంచవ్యాప్తంగా మొదటివారంలో అసాధారణ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు రూ. 43. 50 కోట్లు వసూలు చేసిన 'మెర్సల్'.. తొలిమూడురోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టింది. మొత్తానికి తొలివారంలో ఈ సినిమా రూ. 170 కోట్లు రాబట్టిందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది. 'మెర్సల్' ఓవర్సీస్ వసూళ్లు కూడా కళ్లుచెదిరే రీతిలో ఉండటం గమనార్హం. తొలివారంలో ఈ సినిమా విదేశాల్లో రూ. 45 కోట్లు రాబట్టింది. కొన్నిరోజుల కిందట ఈ సినిమా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసినట్టు సినిమా యూనిట్ ధ్రువీకరించింది. మొత్తం తొలివారం వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏదిఏమైనా 'మెర్సల్' విజయ్ కెరీర్లో రూ. 200 కోట్లు సాధించిన తొలి సినిమా రికార్డు దిశగా సాగుతోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. -
మూడోరోజు కలెక్షన్స్.. ఇంకాస్తా పెరిగాయ్!
నిత్యం వివాదాల్లో నిలిచే బాలీవుడ్ తార కంగన రనౌత్ తాజా సినిమా 'సిమ్రన్'.. ఈ సినిమా వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం క్రమంగా పెరిగాయి. తొలి రోజు శుక్రవారం రూ. 2.77 కోట్లు వసూలు చేసిన 'సిమ్రన్' రెండోరోజు రూ. 3.76 కోట్లు దక్కించుకుంది. ఇక మూడో రోజు ఆదివారం ఈ సినిమా వసూళ్లు ఇంకాస్తా మెరుగుపడ్డాయి. నాలుగోరోజు రూ. 4.12 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా తొలి వీకెండ్లో ఈ సినిమా రూ. 10.65 కోట్లను కలెక్ట్ చేసింది. వీక్ డేస్‌లోనూ ఇదే నిలకడను కొనసాగిస్తే ఈ సినిమా గౌరవప్రదమైన వసూళ్లు రాబట్టవచ్చునని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు కంగనను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగన.. బాలీవుడ్ అగ్ర హీరోలపై ధైర్యంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విడుదలైన 'సిమ్రన్' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు వచ్చినా.. సినిమా కథ అంత గొప్పగా లేదని విమర్శలు వినిపించాయి. విమర్శకులు ఈ సినిమాపై పెదవివిరిచారు. ఇక ఫర్హాన్ అక్తర్ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్' సినిమా బాక్సాపీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 8.42 కోట్లు వసూలు చేసింది. -
మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ ఓకే!
నిత్యం వివాదాల్లో నిలిచే బాలీవుడ్ తార కంగన రనౌత్ తాజా సినిమా 'సిమ్రన్'.. ఈ సినిమా విడుదలకు ముందు పలు వివాదాలు కంగనను చుట్టుముట్టాయి. ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగన.. బాలీవుడ్ అగ్ర హీరోలపై ధైర్యంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విడుదలైన 'సిమ్రన్' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు వచ్చినా.. సినిమా అంత గొప్పగా లేదని విమర్శలు వినిపించాయి. విమర్శకులు ఈ సినిమాపై పెదవివిరిచారు. మిక్స్డ్ టాక్ నేపథ్యంలో తొలి రోజు శుక్రవారం రూ. 2.77 కోట్లు వసూలు చేసిన 'సిమ్రన్' రెండోరోజు వసూళ్లలో గణనీయంగా పుంజుకుంది. రెండోరోజూ వసూళ్లలో 35.74శాతం వృద్ధి నమోదు చేసి.. రూ. 3.76 కోట్లు దక్కించుకుంది. మొత్తంగా దేశంలో తొలి రెండు రోజుల్లో రూ. 6.53 కోట్లు వసూలు చేసింది. ఆదివారం ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. కలెక్షన్లు క్రమంగా పెరిగితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశముందని భావిస్తున్నారు. ఇక ఫర్హాన్ అక్తర్ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్' సినిమా రెండురోజుల్లో రూ. 4.86 కోట్లు వసూలు చేసి నిరాశపరిచింది. -
జీఎస్టీ తర్వాత వందకోట్లు దాటిన సినిమా!
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ 25వ సినిమా ‘వివేగం’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. ఆగస్టు 24న విడుదలైన ఈ సినిమా రెండో వారంలోనూ భారీ కలెక్షన్లు సాధించింది. చెన్నైలో కబాలి, బాహుబలి 2 రికార్డులను అధిగమించిన ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లతో రూ.150 కోట్ల క్లబ్లో చేరినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఓపెనింగ్ వీకెండ్ నాటికే రూ. వంద కోట్లు వసూళ్లు దక్కించుకుంది. జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత టిక్కెట్ల ధరలు పెరగడంతో తమిళనాడులో ధియేటర్లు వెలవెలబోయాయి. అయితే ‘తలా’ దెబ్బకు ధియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రూ. వంద కోట్లుపైగా వసూళ్లు సాధించిన తొలి తమిళ సినిమాగా ‘వివేగం’ నిలిచింది. మీడియాలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమా బ్రహ్మరథం పట్టడం విశేషం. భారీ యాక్షన్, పవర్ఫుల్ డైలాగులు, అజిత్ అద్భుత నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాజల్ అగర్వాల్, వివేక్ ఒబరాయ్, అక్షర్ హాసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను శివ తెరకెక్కించారు. -
ఆ సినిమాకు ఫస్టు రోజే రికార్డు కలెక్షన్లు
తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన 'వివేగం' సినిమా రికార్డు వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. చెన్నైలో ఈ సినిమా వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. రజనీకాంత్ 'కబాలి' రికార్డును బ్రేక్ చేసింది. చెన్నైలో 'కబాలి' తొలి రోజు రూ. 1.12 కోట్లు సాధించగా, 'వివేగం' రూ. 1.21 కోట్లు వసూలు చేసి రికార్డు తిరగరాసింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అజిత్ సినిమాకు మొదటిరోజు భారీ కలెక్షన్లు రావడం విశేషం. తమిళనాడులో రూ. 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల ప్రాథమిక సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళంలోనే రూ. 35 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు వస్తాయని 'ది హిందు' అంచనా వేసింది. అదే నిజమైతే 'కబాలి' రికార్డు చెరిగిపోవడం ఖాయం. రూ.21 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్‌తో కోలీవుడ్‌లో 'కబాలి' ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంది. రూ.100 కోట్లపైగా బడ్జెట్‌తో నిర్మించిన 'వివేగం' ప్రపంచవ్యాప్తంగా మూడు వేలకుపైగా ధియేటర్లలో విడుదలైంది. అజిత్ 25వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో 'వివేకం' పేరుతో విడుదల చేశారు. శివ దర్శకత్వం వహించారు. హీరోయిన్గా కాజల్ నటించింది. -
‘ఆనందో బ్రహ్మ’ అదరగొడుతోంది
హైదరాబాద్: తాప్సి ప్రధానపాత్రలో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్ల వారాంతపు కలెక్షన్లు సాధించింది. మొదటి రోజున రూ. 5 కోట్లు, రెండు రోజు రూ.5.5 కోట్లు, రూ. 6.5 కోట్ల వసూళ్లు తెచ్చుకుంది. మనుషులను చూసి దెయ్యం భయపడితే? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. సానుకూల సమీక్షలకు మౌత్ పబ్లిసిటీ తోడవటంతో నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తాగుబోతు రమేశ్, ‘షకలక’ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. హీరో సుధీర్‌బాబు అతిథి పాత్రలో మెరిశారు. -
బడ్జెట్ 18 కోట్లు.. వసూళ్లు 100 కోట్లు
ముంబై: బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఎనిమిది రోజుల్లో వంద కోట్ల క్లబ్లో చేరింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 8 రోజుల్లో రూ.100.05 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ.18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే దానికి నాలుగింతలు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రెండో వారంలోనూ నిలకడగా వసూళ్లు రాబడుతూ నిర్మాతలు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ. 13.10 కోట్లు, రెండో రోజు 17.10 కోట్లు, మూడో రోజు 21.25 కోట్లు, నాలుగో రోజు రూ. 12 కోట్లు, ఐదో రోజు రూ. 20 కోట్లు, ఆరో రోజు 6.50 కోట్లు, ఏడో రోజు రూ. 6.10 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 4 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇటీవల కాలంలో విడుదలైన అగ్రహీరోల సినిమాలు నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ చిత్ర విజయం బయ్యర్లకు ఊరటనిచ్చింది. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ సరసన భూమి పడ్నేకర్ నటించింది. -
డిజాస్టర్ల నడుమ ఆ సినిమాకు భారీ వసూళ్లు!
బాలీవుడ్‌కు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. సూపర్స్టార్లు సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్', షారుఖ్ ఖాన్ 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం యావరేజ్ కలెక్షన్లు కూడా రాబట్టలేక.. డిజాస్టర్లుగా మిగిలాయి. 'బాహుబలి-2' తర్వాత బాలీవుడ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన యాక్షన్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ' బాలీవుడ్ ఆశలను నిలబెట్టింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరినిచ్చింది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 50 కోట్లు రాబట్టింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. తొలిరోజు రూ. 13.10 కోట్లు రాబట్టిన 'టాయ్‌లెట్' రెండోరోజూ శనివారం మరింత పుంజుకొని ట్రెడ్ అనలిస్టులను ఆశ్చర్యపరిచింది. రెండోరోజు ఈ సినిమా ఏకంగా రూ. 17.10 కోట్లు రాబట్టగా.. మూడో రోజు ఆదివారం రూ. 20.05 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికి తొలి వారాంతంలో ఈ సినిమా అంచనాలను మించి రూ. 50.25 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ వారాంతం తర్వాత కూడా వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసివచ్చే అంశం. 'టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. స్ట్రాంగ్ మౌత్‌టాక్ ఈ సినిమాకు భారీ వరంగా మారింది. శుక్రవారం రూ. 13.10 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా శనివారం 17.10 కోట్లు వసూలు చేసింది. ' అని బాలీవుడ్ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ట్విట్టర్లో వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకమైన 'స్వచ్ఛభారత్' మద్దతుగా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 'భార్య ఇంట్లో ఉండాలంటే.. ఇంట్లో టాయ్‌లెట్ ఉండాల్సిందే' అన్న సామాజిక అంశంతో తెరకెక్కిన సినిమాపై కొందరు విమర్శకులు పెదవి విరిచారు. కానీ ప్రేక్షకులు మాత్రం తెరపై అక్షయ్ మార్క్ కామెడీని చూసేందుకు పోటెత్తుతున్నారని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. తనదైన స్టైల్ కామెడీ టైమింగ్‌తో అక్షయ్ ఈ సినిమాను నిలబెట్టాడని అంటున్నారు. అక్షయ్ కామెడీ డైలాగ్ పేల్చిన ప్రతిసారీ థియేటర్ నవ్వులతో దద్దరిల్లుతోందని చెప్తున్నారు. మొత్తానికి ఎయిర్‌లిప్ట్, రుస్తుం, హౌస్‌ఫుల్-3, జాలీ ఎల్ఎల్బీ-2 చిత్రాలతో వరుసగా వందకోట్ల క్లబ్బును అందుకున్న ఈ సూపర్ స్టార్ మరోసారి సూపర్ హిట్‌ను అందుకొని తన స్టామినా ఏంటో చాటాడు. -
వంద కోట్లు దాటిన 'జాలీ' కలెక్షన్లు
ముంబై: అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ’జాలీ ఎల్ఎల్బీ-2’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. విడుదల రెండు వారాల్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్లు రాబడుతోంది. నాలుగు వారాతంలో ఈ సినిమా రూ. 1.50 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం రూ. 114.47 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని వెల్లడించారు. మొదటి వారంలో రూ. 72.98 కోట్లు, రెండో వారంలో రూ. 23.77 కోట్లు, మూడో వారంలో 8.03 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్ ఇంతకుముందు నటించిన రుస్తుం, ఎయిర్ లిఫ్ట్, రౌడీ రాథోడ్ తదితర సినిమాలు కూడా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాయి. 2013లో వచ్చిన ’జాలీ ఎల్ఎల్బీ’ కి సీక్వెల్‌గా తెరకెక్కిన ’జాలీ ఎల్ఎల్బీ-2’ లో అక్షయ్‌కుమార్ లాయర్ గా నటించాడు. అన్నుకపూర్, హ్యుమా ఖురేషీ, సౌరబ్ శుక్లా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.