డిజాస్టర్ల నడుమ ఆ సినిమాకు భారీ వసూళ్లు! | Toilet Ek Prem Katha box-office collection | Sakshi
Sakshi News home page

డిజాస్టర్ల నడుమ ఆ సినిమాకు భారీ వసూళ్లు!

Published Mon, Aug 14 2017 12:41 PM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

డిజాస్టర్ల నడుమ ఆ సినిమాకు భారీ వసూళ్లు!

డిజాస్టర్ల నడుమ ఆ సినిమాకు భారీ వసూళ్లు!

బాలీవుడ్‌కు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. సూపర్‌స్టార్లు సల్మాన్‌ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌', షారుఖ్‌ ఖాన్‌ 'జబ్‌ హ్యారీ మెట్‌ సెజెల్‌' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం యావరేజ్‌ కలెక్షన్లు కూడా రాబట్టలేక.. డిజాస్టర్లుగా మిగిలాయి. 'బాహుబలి-2' తర్వాత బాలీవుడ్‌ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌ కావడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన యాక్షన్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌కుమార్ తాజా సినిమా 'టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ' బాలీవుడ్‌ ఆశలను నిలబెట్టింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్‌ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరినిచ్చింది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 50 కోట్లు రాబట్టింది.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. తొలిరోజు రూ. 13.10 కోట్లు రాబట్టిన 'టాయ్‌లెట్‌' రెండోరోజూ శనివారం మరింత పుంజుకొని ట్రెడ్‌ అనలిస్టులను ఆశ్చర్యపరిచింది. రెండోరోజు ఈ సినిమా ఏకంగా రూ. 17.10 కోట్లు రాబట్టగా.. మూడో రోజు ఆదివారం రూ. 20.05 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.  మొత్తానికి తొలి వారాంతంలో ఈ సినిమా అంచనాలను మించి రూ. 50.25 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ వారాంతం తర్వాత కూడా వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసివచ్చే అంశం.

'టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. స్ట్రాంగ్‌ మౌత్‌టాక్‌ ఈ సినిమాకు భారీ వరంగా మారింది. శుక్రవారం రూ. 13.10 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా శనివారం 17.10 కోట్లు వసూలు చేసింది. ' అని బాలీవుడ్‌ ట్రెడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఇప్పటికే ట్విట్టర్‌లో వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకమైన 'స్వచ్ఛభారత్‌' మద్దతుగా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 'భార్య ఇంట్లో ఉండాలంటే.. ఇంట్లో టాయ్‌లెట్‌ ఉండాల్సిందే' అన్న సామాజిక అంశంతో తెరకెక్కిన సినిమాపై కొందరు విమర్శకులు పెదవి విరిచారు. కానీ ప్రేక్షకులు మాత్రం తెరపై అక్షయ్‌ మార్క్‌ కామెడీని చూసేందుకు పోటెత్తుతున్నారని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. తనదైన స్టైల్‌ కామెడీ టైమింగ్‌తో అక్షయ్‌ ఈ సినిమాను నిలబెట్టాడని అంటున్నారు. అక్షయ్‌ కామెడీ డైలాగ్‌ పేల్చిన ప్రతిసారీ థియేటర్‌ నవ్వులతో దద్దరిల్లుతోందని చెప్తున్నారు. మొత్తానికి ఎయిర్‌లిప్ట్‌, రుస్తుం, హౌస్‌ఫుల్‌-3, జాలీ ఎల్‌ఎల్‌బీ-2 చిత్రాలతో వరుసగా వందకోట్ల క్లబ్బును అందుకున్న ఈ సూపర్ స్టార్‌ మరోసారి సూపర్‌ హిట్‌ను అందుకొని తన స్టామినా ఏంటో చాటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement