జీఎస్టీ తర్వాత వందకోట్లు దాటిన సినిమా!
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ 25వ సినిమా ‘వివేగం’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. ఆగస్టు 24న విడుదలైన ఈ సినిమా రెండో వారంలోనూ భారీ కలెక్షన్లు సాధించింది. చెన్నైలో కబాలి, బాహుబలి 2 రికార్డులను అధిగమించిన ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లతో రూ.150 కోట్ల క్లబ్‌లో చేరినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఓపెనింగ్ వీకెండ్ నాటికే రూ. వంద కోట్లు వసూళ్లు దక్కించుకుంది.
జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత టిక్కెట్ల ధరలు పెరగడంతో తమిళనాడులో ధియేటర్లు వెలవెలబోయాయి. అయితే ‘తలా’ దెబ్బకు ధియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రూ. వంద కోట్లుపైగా వసూళ్లు సాధించిన తొలి తమిళ సినిమాగా ‘వివేగం’ నిలిచింది. మీడియాలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమా బ్రహ్మరథం పట్టడం విశేషం. భారీ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగులు, అజిత్ అద్భుత నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కాజల్ అగర్వాల్, వివేక్ ఒబరాయ్, అక్షర్ హాసన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను శివ తెరకెక్కించారు.