సాక్షి, చెన్నై: మెర్శల్ చిత్రానికి ముందు ముందు మరో ముప్పు పొంచి ఉందా? ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది. హీరో విజయ్ నటించిన తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా గత నెల 18వ తేదీన విడుదలైంది.
ఈ సినిమా సక్సెస్ టాక్‌తో పాటు పలు వ్యతిరేకతలను ఎదుర్కొంది. ఈ గొడవ సద్దుమణిగిందనుకుంటే, తాజాగా ఆ చిత్రం సాధిస్తున్న వసూళ్లు ఇబ్బందులను తెచ్చి పెట్టేలా ఉన్నాయి. మెర్శల్ చిత్రం విడుదలైన రెండు వారాల్లో రూ.200 కోట్ల వసూల్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నట్లు సమాచారం.
నిర్మాతలకు ఐటీ బెడద
కాగా మెర్శల్ చిత్ర వసూళ్లపై ఆ చిత్ర నిర్మాత పెదవి విప్పడం లేదు. లెక్కలను సర్ధుబాటు చేసే పనిలో పడినట్లు సినీ వర్గాల సమాచారం. మెర్శల్ వసూళ్ల వివరాలు బయట పడితే పెద్ద మొత్తంలో ఆదాయ శాఖకు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ భయంతో చిత్రానికి పని చేసిన సాంకేతిక వర్గానికి సగం చెక్కు రూపంలోనూ, మరి కొంత రొక్కంగానూ చెల్లిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా కొందరిని ఓచర్‌పై సంతకాలు తీసుకుని, మరికొందరికి అవి లేకుండా వేతనాలు చెల్లించి పన్ను పోటు నుంచి బయట పడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తమిళ పత్రికల కథనం.
నిర్మాతే చెప్పాలి
తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాధన్ మాట్లాడుతూ.. మెర్శల్ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్లు సాధించిందా ? అన్నది ఆ చిత్ర నిర్మాతే చెప్పాల్సి ఉంటుందనీ ఇతరులెవరూ చెప్పడం సరికాదని పేర్కొన్నారు. మెర్శల్ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోందని మాత్రం తాను చెప్పగలననీ అన్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వసూళ్ల విషయంలో కరెక్ట్ సమాచారం వచ్చే వరకూ తాము వేచి చూస్తామని ఆయన తెలిపారు.
గమనిస్తున్నాం.. సోదాలుంటాయి
మెర్శల్ చిత్ర వసూళ్ల వ్యవహారం గురించి ఆదాయ శాఖ అధికారి స్పందించారు. ఆ చిత్ర కలెక్షన్ల విషయం గురించి తాము పలు విధాలుగా సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. సరైన ఆధారాలు లభించినప్పుడు అందుకు తగ్గట్టుగా పన్నును వసూలు చేస్తామన్నారు. అందులో అవకతవకలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరం అయితే ఐటీ దాడులు చేస్తామని ఆయన అన్నారు.
విజయం మూడు రకాలు
ఒక చిత్ర విజయాన్ని మూడు రకాలుగా భావిస్తారు. పెట్టన పెట్టుబడి, దానికి వడ్డీతో పాటు కొంచెం లాభాలు వస్తే ఆ చిత్రం హిట్ అయ్యినట్లు. ఇక పెట్టుబడి, వడ్డీతో పాటు అదనంగా 20 శాతం లాభాలు తెచ్చి పెడితే ఆ చిత్రం సూపర్ హిట్. మూడోరకం పెట్టుబడి, వడ్డీలతో పాటు ఆ మొత్తం మీద 40 శాతం లాభాలు వస్తే ఆ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ అయ్యినట్లు అని సినీ పండితులు అంటున్నారు. మరి మెర్శల్ ఈ మూడింటిలో ఏ రకానికి చెందుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment