
లండన్: ప్రముఖ చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్ రాయబారిగా తప్పుకుంటున్నట్టు తాజాగా బ్రిటిష్ నటి మిన్నీ డ్రైవర్ వెల్లడించారు. తాజాగా ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సెక్స్ స్కాండల్‌లో ప్రమేయమున్నట్టు తాజాగా వెలుగుచూడటం దుమారం రేపుతోంది. 2010లో హైతీలో భూకంపం వచ్చిన నేపథ్యంలో అక్కడ బాధితులకు సహాయం చేసేందుకు వెళ్లిన ఆక్స్‌ఫామ్ సీనియర్ సిబ్బంది.. విరాళాల సొమ్మును వ్యభిచారిణులపై తగిలేసినట్టు తాజాగా వెలుగుచూసింది. దీనిపై సంస్థ రాయబారిగా ఉన్న మిన్నీ తీవ్రంగా స్పందించారు.
ఈ సెక్స్ స్కాండల్ ఆరోపణలు తనను కకావికలం చేశాయని, తనకు తొమ్మిదేళ్ల వయస్సు నుంచి ఈ స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నానని, సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తులే మహిళలను వాడుకున్నారని తెలియడం కలిచివేస్తోందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రతినిధి తెలిపారు. హైతీలో భూకంప బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన సీనియర్ ఎయిడ్ వర్కర్స్ వేశ్యలతో గడిపారని, ఈ విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రయత్నించిందని తాజాగా వెలుగుచూసింది. అంతేకాకుండా సౌత్ సూడాన్‌లోనూ లైంగిక దాడుల విషయంలో సంస్థ సరిగ్గా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment