
కండలవీరుణ్ణి కలవరపెట్టిన మెసేజ్..!
సినీ అభిమానానికి కులం, ప్రాంతం, మతం లాంటి భేదాలుండవు. కానీ, కొందరు అత్యుత్సాహంతో తమ హీరోలకు ఆ రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. తాజాగా కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు ఓ అనుహ్య పరిస్థితి ఎదురైంది. అనుకోకుండా ఓ వాట్సాప్ మెసేజ్ సల్మాన్‌ను కంగారు పడేలా చేసింది. ఎక్కణ్ణించి వచ్చిందో తెలీదు. కానీ, ఆ మెసేజ్ ఇప్పుడీ చుల్‌బుల్ పాండేను పోలీస్ శాఖను ఆశ్రయించేలా చేసింది. ‘‘హనుమాన్ భక్తుడిగా నేను నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్ర విజయానికి ముస్లిమ్‌ల మద్దతు అవసరం లేదు’’అని సాక్షాత్తూ సల్మాన్ ఖాన్ అన్నారని ఆ వాట్సాప్ మెసేజ్ సారాంశం.
ఓ హిందీ చానల్‌లో ఆయన ఆ మాటలు వ్యాఖ్యానించినట్లు ప్రచారమైంది. కానీ, తానలాంటి వ్యాఖ్యలు చేయలేదని సల్మాన్ స్పష్టం చేశారు. కొందరు చేస్తున్న ఈ దుష్ర్పచారం వల్ల తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని సల్మాన్ పోలీసులకు ఉత్తరం రాశారు.