నాకు నేనే బాస్
తెలుగులో బుర్ర తక్కువ దర్శకులు ఎక్కువ
‘‘ఇకపై నేను సంగీత దర్శకుడిగా కొనసాగితే... నాకు నేనే బాస్! దర్శకుడితో సహా నా బాణీలకు ఎవరూ బాస్‌గా ఉండరు. ఈ నిర్ణయం నా బాధ్యతను పెంచుతుంది. నా అభిప్రాయంలో ‘సంగీత దర్శకుడు తన ఆధీనంలో ఉండడు అనే ఐడియాను ఏ దర్శకుడూ ఇష్టపడడు. తెలుగు చిత్ర పరిశ్రమలో బుర్ర తక్కువ (బ్రెయిన్‌లెస్) దర్శకులు ఎక్కువ. అలాంటోళ్లు ఉన్నంత వరకూ నేను స్వరకర్తగా కొనసాగే అవకాశాలు తక్కువ’’ అని ఘాటుగా స్పందించారు ఎం.ఎం. కీరవాణి. తమ్ముడు రాజమౌళి, కుటుంబ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించిన కీరవాణి, ఆయన పనిచేసిన దర్శకుల్లో కొందరిని మూగ మనుషులు, చెవిటోళ్లు అంటూ విమర్శలు చేశారు. ‘‘నా క్రమశిక్షణ, నా సతీమణి (శ్రీవల్లి) స్ట్రాంగ్ సపోర్ట్ వల్ల చిత్ర పరిశ్రమలో గౌరవం సంపాదించుకున్నా. తనే నా శివగామి. తను కూడా నేను రిటైర్ కాకూడదని కోరుకుంటోంది. కానీ, నేను నిర్ణయించుకున్నా’’ అని ఆదివారం మధ్యాహ్నం ట్విట్టర్‌లో రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆయన, తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. ‘‘నా స్వీయ నిబంధనల మేరకు స్వరకర్తగా నా ప్రయాణం సాగుతుంది’’ అని సాయంత్రం 5.30 గంటలకు ప్రకటించారు. అంతకు ముందు ట్విట్టర్‌లో కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా...
ఈ ప్రయాణంలో అన్నీ పాఠాలే
నా ప్రయాణం మౌళి (సంగీత దర్శకుడిగా కీరవాణి తొలి చిత్రం ‘మనసు మమత’ దర్శకుడు) గారితో మొదలైంది. 27 ఏళ్ల తర్వాత ఈ రోజు నేనిక్కడ రాజమౌళితో ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎలాంటి చీకూ చింతలు లేవు. కేవలం పాఠాలు మాత్రమే నేర్చుకున్నాను. దేవుడు నన్ను కీర్తి ప్రతిష్ఠలు, పరాజయాలు... రెండిటితో ఆశీర్వదించాడు.
రాజమౌళి మాట వింటాడు... ఇతరులు వినరు!
నేనెక్కువగా బుర్ర తక్కువ దర్శకులతోనే పనిచేశా. వాళ్లు నా మాటలు వినేవారు కాదు. రాజమౌళికి నేను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కారణం అతను నా మాట వింటాడు. దర్శకులు నేను ఓ సంగీత దర్శకుణ్ణి మాత్రమే అనుకుంటారు. మంచి సలహా ఇచ్చినా తీసుకోరు. కథ వినేటప్పుడే నేను చేసిన చాలా చిత్రాలు ఫ్లాప్ అవుతాయని ఊహించా. కానీ, ఆ చిత్రదర్శకులు చెవిటోళ్లు. ఆ చెవిటితనం వల్ల మంచి బాణీలకు హాని కలగదు. కానీ, మంచి సలహా ఇచ్చినప్పుడు స్వీకరించలేని చెవిటితనం దర్శకుడికీ, చిత్రానికీ, నాకూ హాని చేస్తుంది. నా శ్రేయోభిలాషుల కోరిక మేరకు నేను సంగీత దర్శకుడిగా కొనసాగితే... చెవిటి, మూగ దర్శకులతో ప్రయాణించాలను కోవడం లేదు. ఎందుకంటే... ఓ స్వరకర్తగా నేను ఎప్పుడూ గర్వపడలేదు. నాలోని రచయితను చూసి గర్వపడుతుంటాను.
రాజమౌళిని ఎవరూ చేరుకోలేరు!
నేను రాజమౌళితో ఉన్నంతవరకూ అతన్నెవరూ చేరుకోలే రు. రాజమౌళికి పని పట్ల భక్తి, ప్రేమ ఉన్నంత వరకూ అతని స్టాండర్డ్స్‌ను ఎవరూ చేరుకోలేరు. ఇది వంద శాతం నిజం. ఇది నా వేదవాక్కు. రాజమౌళి తర్వాత ఎస్.ఎస్. కాంచి (కీరవాణి తమ్ముడు)పై ఆశలు ఉన్నాయి. అతని అభిప్రాయాలతో నావి వంద శాతం కలుస్తాయి. మా నాన్నగారు (శివశక్తి దత్తా) బహు ముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప ఆర్టిస్ట్.. గొప్ప సంస్కృత రచయిత. ఆయన కుమారుడిగా పుట్టినందుకు గర్విస్తున్నా. కానీ, ఆయన తీసిన ‘చంద్రహాస్’ సినిమా నాకు నచ్చలేదు.
తమన్‌కి ఆత్రుత ఎక్కువ!
రెండేళ్ల క్రితం రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌తో సహా 99 శాతం మంది నేను రిటైర్ కాకూడదని కోరుకు న్నారు. కొందరు మాత్రమే సంతోషపడ్డారు. వాళ్లందరూ సోషల్ మీడియాలో అజ్ఞాత ఐడీల నుంచి స్పందించినవాళ్ళే. అనంత శ్రీరామ్ (రచయిత) ఒక్కడే ధైర్యంగా నా ముఖం మీద రిటైర్‌మెంట్‌కు మద్దతు తెలిపాడు. తమన్ (సంగీత దర్శకుడు) అయి తే పలుమార్లు నా అసిస్టెంట్ జీవన్ (సంగీత దర్శకుడు జేబీ) దగ్గర నా రిటైర్‌మెంట్ గురించి ఆత్రుతగా ఆరా తీశాడు. తమన్ నా ఫ్యానే కానీ, జీవన్‌లాంటి మంచి ప్రోగ్రామర్ అతనికి కావాలి.
‘బాహుబలి’ సక్సెస్‌పై ఎవరికీ కాన్ఫిడెన్స్ లేదు
దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, ‘వారాహి’ సాయిగారితో సహా ‘బాహుబలి’ సక్సెస్‌పై ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు. ‘అంబికా’ కృష్ణ ఊహ తప్పిస్తే నేనొక్కడినే ఈ చిత్రం అసాధారణ విజయంపై నమ్మకంగా ఉన్నాను. నేను క్రాంతికుమార్‌గారిని (దర్శక–నిర్మాత) మిస్ అవుతున్నా. ఆయన అహంకారే. కానీ, గౌరవించ దగ్గ ప్రతిభావంతుడు. రాజమౌళి కీర్తి పతిష్ఠలను ఆయన చూసుంటే గర్వపడేవారు. ఆర్కా మీడియా లేకపోతే భారత దేశంలో ఇంత పెద్ద సినిమా సాధ్యమయ్యేది కాదు.
రామ్‌గోపాల్‌వర్మకు చురకలు!
ట్విట్టర్‌లో హీరోలు, దర్శక–నిర్మాతలు, రాజకీయ నాయకులు... వాళ్లూ–వీళ్లూ అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరిపై చురకలు వేయడం దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అలవాటు. అటువంటి వర్మపై కీరవాణి చురకలు వేశారు. ‘‘రాముగారు ‘క్షణక్షణం’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు మాత్రమే చేయమని నాకు సలహా ఇచ్చారు. నేనెప్పుడూ ఆయన మాట వినలేదు. మాది పెద్ద కుటుంబం కావడంతో, నాకున్న కుటుంబ బాధ్యతల వల్ల నా తలుపు తట్టిన ప్రతి అవకాశాన్నీ అంగీకరించా. ‘చీప్ ప్రొడక్షన్స్‌తో పని చెయ్యొద్దు’ అని నాకిచ్చిన సలహాను వర్మ తర్వాత పాటించలేదు. నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ తీసిన తర్వాత కూడా వర్మ అత్యంత మేథావి దర్శకుడిగానే మిగులుతాడు. ‘జాము రాతిరి..’ పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీనే’’ అన్నారు కీరవాణి.
రాఘవేంద్రరావు నా గాడ్ ఫాదర్
కేఆర్ (కె. రాఘవేంద్రరావు) నా గాడ్‌ఫాదర్. ఆయన ‘పెళ్లి సందడి’ వంటి సోషల్ సినిమాల మీద దృష్టి పెట్టాలని నా ఆశ. ‘తెలుసా మనసా..’ పాట మధ్యలో చెప్పినట్టు... నా సుఖ దుఃఖాల్లో నాగార్జున నా చేయి విడిచి పెట్టలేదు. ఆయనకు కృతజ్ఞతగా ఉంటా. రామోజీరావు, కృష్ణంరాజు. రాఘవేంద్రరావు, బాలచందర్, మహేశ్‌భట్, నా కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞుడిగా ఉంటాను. తిరుమలేశుని భక్తులు మొదలుకుని జీసస్ అనుచరుల వరకూ నా అభిమానులున్నారు. వాళ్లందర్నీ నేను ప్రేమిస్తాను.
►వేటూరిగారి మరణం, ‘సిరివెన్నెల’ అనారోగ్యం కారణంగా తెలుగు సాహిత్యం (తెలుగు పాట) అంపశయ్యపై ఉంది!