
'23 ఏళ్ల తరువాత పెళ్లి చూపులు'
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన పెళ్లి చూపులు సినిమాకు ఇంకా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లను సాధించింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ సినిమాను చూసి చిత్రయూనిట్ను అభినందించారు.
నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి సినిమా చూసిన అజారుద్ధీన్ 'చాలా కాలం నుండి మా అబ్బాయి అబ్బాస్ తెలుగులో వచ్చిన పెళ్లి చూపులు చూడమని చెపుతున్నాడు. నేను కూడా చాలా రోజులుగా చూద్దామని అనుకున్నా.. కానీ ఇప్పటికి కుదిరింది. పెళ్లిచూపులు సినిమా చాలా బాగుంది. దాదాపు 23 ఏళ్ల తరువాత తెలుగు సినిమా చూశా. చాలా ఏళ్ల క్రితం ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమాను వైజాగ్లో చూశా.. తరువాత ఇన్నేళ్లకు పెళ్లి చూపులు చూశాను. నాకు బాగా నచ్చింది' అన్నారు.