భోరున విలపించిన మోహన్ బాబు
హైదరాబాద్ : దాసరి నారాయణరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో మూలస్థంభాన్ని కోల్పోయామని నటుడు మోహన్ బాబు అన్నారు. దాసరి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ఎదుట భోరున విలపించారు. దాసరి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని, నటనలో తనకు ఓనమాలు నేర్పిన గురువు అని చెప్పుకొచ్చారు.
తనకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాని మోహన్ బాబు అన్నారు. తనకు నటుడుగా దాసరి జన్మినిచ్చారన్నారు. నటుడిగా తనకో జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు.
కన్నతల్లి కన్నా ఎక్కువగా తన గురువు దాసరి, ఆయన సతీమణి వద్దే ఎక్కువ సమయాన్ని గడిపానని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు.
అస్తమించిన తెలుగు శిఖరం: బోయపాటి శీను
‘దర్శక ద్రోణాచార్యుడు మా దాసరి గారు మా మధ్య లేరనే వార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు.ఆయన చూపిన బాటలో మా దర్శకులం అందరం నడిచి.. ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం’ అని అన్నారు.
అలాగే దాసరి లేని లోటు తీర్చలేనిదన్నారు సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. ఆయన అసమాన ప్రతిభావంతుడని కొనియాడారు. ఈ సందర్భంగా ఉదయం పత్రికలో పని చేసినప్పుడు దాసరితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.