సాక్షి, ముంబై: దంగల్ నటి జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరికి చెందిన వికాస్ సచ్దేవ్ అనే 36 ఏళ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. జైరా వసీం మైనర్ అయినందున నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేశారు.
అయితే, నిందితుడు మాత్రం తాను ఉద్దేశపూర్వకంగా జైరా వసీంను తాకలేదని పోలీసులకు తెలిపాడు. తన కాలివేలు ఆమెను తాకిందని చెప్పగానే.. ఆమెకు క్షమాపణ కూడా చెప్పానని వివరణ ఇచ్చాడు. ఢిల్లీలో అంత్యక్రియలకు హాజరైన తాను నిద్రలేక చాలా అలసటతో ఉన్నానని, అందువల్ల తనను డిస్టర్బ్ చేయవద్దని క్యాబిన్ సిబ్బందిని కోరానని, విమాన ప్రయాణంలో పూర్తిగా పడుకోవాలని భోజనం కూడా చేయలేదని అతను తెలిపాడు. ఈ ఘటనపై విస్తారా ఎయిర్‌లైన్స్ వాదన కూడా కొంతమేరకు నిందితుడి వాదనతో ఏకభవించడం గమనార్హం. తమ విమానంలో జరిగిన ఘటనపై విస్తారా ఎయిర్లైన్స్ ఇప్పటికే డీజీసీఏకు నివేదిక అందించింది. శనివారం రాత్రి విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళుతుండగా.. జైరాపై వికాస్ వేధింపులకు పాల్పడ్డాడు. విమానం దిగగానే బాధితురాలు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టింది. కన్నీటిపర్యంతమవుతూ.. తనను అసభ్యంగా తాకాడని ఆమె తెలిపింది.
అయితే, వికాస్ భార్య దివ్య కూడా జైరా వసీం వాదనను తప్పుబడుతోంది. "ఢిల్లీ నుంచి ఆయన తిరిగొచ్చారు. ఆయన మామ చనిపోయాడు. దీంతో ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ స్థితిలో ఆయన బ్లాంకెట్ అడిగి తీసుకొని పడుకున్నారు. ఆమె ఆరోపణలు నన్ను షాక్‌కు గురిచేశాయి' అని దివ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment