
స్పెక్టర్ సినిమాలో బాండ్ గర్ల్ గా అలరించిన మోనికా బెలూసి త్వరలో భారత్ కు రానున్నారు. 50 ఏళ్ల వయసులో బాండ్ గర్ల్ గా నటించి మెప్పించిన ఈ సీనియర్ హాలీవుడ్ నటి ఓల్డెస్ట్ బాండ్ గర్ల్ గా రికార్డ్ సృష్టించారు. స్పెక్టర్ తో పాటు ది మ్యాట్రిక్స్ రిలోడెడ్, ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మోనికా ముంబై లో జరగనున్న మామి ముంబై ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నారు.
తొలిసారిగా భారత్ కు రావటంపై మోనిక హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫెస్టివల్ లో మోనికా బెలూసి నటించిన ఆన్ ద మిల్కీ వే, ఇర్రివర్సిబుల్ సినిమాలను ప్రదర్శించనున్నారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఆధ్వర్యంలో జరిగే ఆ వేడుక అక్టోబర్ 12 నుంచి 18 వరకు కొనసాగనుంది. అనురాగ్ కశ్యప్ ప్రారంభించనున్న ఈ వేడుకలో 49 దేశాలకు చెందిన 51 భాషల 220 సినిమాలను ప్రదర్శించనున్నారు.