మీడియాతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బృందం
సాక్షి, హైదరాబాద్ : నటి శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వెనక్కి తగ్గింది. శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మా బృందం తెలిపింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్‌లో 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా తన బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరిట వేధింపులు జరుగుతున్నాయంటూ అర్ధనగ్న నిరసన తెలపడంతో శ్రీరెడ్డికి 'మా' సభ్యత్వం నిరాకరించడంతో ఆమెపై నిషేధం విధించారు. అనంతరం శ్రీరెడ్డి చేసిన పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో పాటు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి మెమోరాండం ఇచ్చిన విషయం తెలిసిందే.
'మా' అధ్యక్షుడు శివాజీరాజా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు, మాటలు, చర్యలతో కేవలం 'మా' మాత్రమే కాదు, ఎంతో మంది ఆర్టిస్టులు మనస్తాపానికి లోనయ్యారు. అందుకే ఆమెపై బ్యాన్ నిర్ణయాన్ని తీసుకున్నాం. అయితే ఆమెపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని, నిషేధంపై పున:పరిశీలించాలని 'మా' సభ్యులు కోరడంతో ఆమెపై నిషేధం ఎత్తివేస్తున్నాం. టాలీవుడ్‌లో కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్‌మెంట్ (క్యాష్) కమిటీని ఏర్పాటు చేశాం. ఆమెను మేం ఆహ్వానిస్తున్నాం. ఎవ్వరితోనైనా ఆమె నటించొచ్చు. నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తే ఆమె ఏ సినిమాలోనైనా నటించే స్వేచ్ఛ ఆమెకు ఉంది. శ్రీరెడ్డితో రెండు సినిమాలు చేస్తానని తేజ హామీ ఇచ్చారంటూ' వివరించారు. తమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నటుడు నరేశ్, 'మా' కార్యవర్గ సభ్యులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment