జయశ్రీ రాచకొండ.
డాక్టర్ కావాలనుకొని యాక్టరయ్యానని చాలా మంది నటీనటులు చెప్పుకుంటారు. కానీ లాయర్ కావాలని కలలుగన్న ఆమె మాత్రం లాయర్‌తో పాటు యాక్టర్‌గా తన సృజనను చాటుకోవాలని గట్టి తలంపుతో వెండితెరపై కూడా వెలిగిపోతున్నారు. ఒకవైపు హైకోర్టు న్యాయవాదిగా.. ఇంకోవైపు వెండితెరపై తన అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ఆమె పేరు జయశ్రీ రాచకొండ. నాని నిర్మించిన ‘అ’, చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన మల్లేశం, బుర్రకథ, సీత ఆన్ ది రోడ్ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన అరుదైన పాత్రల్లోనూ మంచి పేరు సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు ‘లాయర్ టరŠడ్న్ సినీ ఆర్టిస్ట్’ జయశ్రీ రాచకొండ.
బంజారాహిల్స్: ఆమె తాజాగా నటించిన ‘చదరంగం జీ–5’ వెబ్ సిరీస్ విశేష ఆదరణ పొందుతూ అందరి దృష్టిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన వసుంధర అనే ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. ఈ ప్రధాన మంత్రి పాత్ర పోషణకు ఆమె అందుకుంటున్న ప్రశంసలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రధానమంత్రిగా పేరుగాంచిన ఐరన్ లేడీ ఇందిరాగాంధీ వంటి పవర్‌ఫుల్ లీడర్‌పాత్రను పోషించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొంటున్నారు.
విజయావకాశాలు మెండుగాఉన్న చిత్రాల్లో..
ప్రస్తుతం తాను ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న వాళ్లిద్దరి మధ్య, విటల్‌వాడీ చిత్రాలతో పాటు పాయల్ రాజ్‌పుత్‌తో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ విజయావకాశాలు మెండుగా ఉన్న చిత్రాలని, తనకు మంచి పేరు తీసుకొస్తాయని తెలిపారు.
నా తల్లే మార్గదర్శి..
ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథంతో సంకల్ప బలంతో ముందుకు సాగి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలనే తలంపుగా పెట్టుకున్నట్లుగా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. మన కళ్లముందు తిరిగే వ్యక్తుల నుంచి ప్రేరణ పొందాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టెక్నికల్ క్యాంపస్ అటానమస్ కాలేజీ విద్యార్థినులతో నిర్వహించిన మహిళా సాధికార సదస్సులో ఆమె సూచించారు. ముని మనవరాల్ని సాకుతూ ఆరు పదులకు చేరువలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న తన తల్లి తనకు మార్గదర్శి అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
జయశ్రీ రాచకొండను సత్కరిస్తున్న సీఎంఆర్ టెక్నికల్ సంస్థ ప్రతినిధులు
చిన్నప్పుడే పెళ్లి..
మాది కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం అల్వాల్‌లో నివాసం. ఉన్నతాభ్యాసం హైదరాబాద్‌లోనే.. రామగుండం ఎఫ్‌సీఐ స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే పదవ తరగతిలో పెళ్‌లైంది. ఆ తర్వాత ఏడాదికే పాప పుట్టింది. బాగా చదవాలనుకున్నా అప్పటికే బాధ్యతలు పెరిగిపోయాయి. నా భర్త జి.వేణుమాధవరావు పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్నారు. తండ్రి నర్సింగరావు అకౌంట్స్ ఆఫీసర్. తల్లి విజయలక్ష్మి గృహిణి. నాకిప్పుడు మనవరాలు కూడా ఉంది. నేను చదవాలనుకున్న కోర్సులను పెళ్లి పిల్లల తర్వాత నెరవేర్చుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చేసి ఉస్మానియా లా కళాశాలలో మెరిట్‌లో ఎల్‌ఎల్‌బీ సీటు సాధించాను. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ప్రతి రెండేళ్లకోసారి ఎఫ్‌సీఏ స్కూల్ రీజెనరేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంటాను. 2016లో ఆ కార్యక్రమానికి వెళ్లినప్పుడు నా సహచర విద్యార్థి మాట్లాడుతున్నప్పుడు నా హావభావాలు గమనించి తన సినిమాలో యాక్ట్ చేస్తావా అంటూ ప్రశ్నించాడు. మొదట అంగీకరించలేదు. తర్వాత మాత్రం తప్పనిసరిగా నటించాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఒకటి తర్వాత ఒకటి సినిమా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ప్రయత్నిస్తే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి కదా అని చాలా మంది అంటున్నా ఇప్పుడున్న సినిమాలు సరిపోతాయని అనుకుంటున్నాను. ఇప్పటికే మంచిమంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment