
అన్నదమ్ముల కలయికలో సినిమా
ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ సినిమాను ఫలానా నిర్మాత నిర్మించనున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే... అవేవీ నిజం కాలేదు. వంశీ మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. తన నమ్మకాన్ని నిజం చేస్తూ... ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్‌రామ్ నిర్మించనుండడం విశేషం. ‘అతనొక్కడే, హరేరామ్’ చిత్రాలతో హీరోగానే కాక, నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటారు కల్యాణ్‌రామ్.
ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్‌తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు కల్యాణ్‌రామ్. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ -‘‘రచయితగా ఎన్నో కథలు రాశాను. ‘ఎవడు, రేసుగుర్రం’ విజయాలు నాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. త్వరలో దర్శకుడిగా మారనున్నాను. రచయితగా ఆదరించినట్లుగానే, దర్శకునిగా కూడా ఆదరిస్తారని నా నమ్మకం. ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అన్నీ ఉండే కథ సిద్ధం చేసుకున్నాను. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో దర్శకునిగా నా తొలి చిత్రం రూపొందడం ఆనందంగా ఉంది. పది రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. ఇతర విశేషాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.